వైఎస్ వివేకా హత్యలో జగన్ దంపతుల పాత్రపై టిడిపి ప్రచారాస్త్రం!

Friday, November 22, 2024

తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సొంత ఇంటిలోనే దారుణంగా హత్యకు గురైన సంఘటనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నెట్టివేసి, 2019 ఎన్నికలలో ప్రచార అస్త్రంగా ప్రయోగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎదురు దాడికి ఇప్పుడు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను ఉటంకిస్తూ, జగన్ దంపతుల ప్రమేయం అందులో ఉన్నదంటూ, వారికి తెలిసే అంతా జరిగినదని పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.

వివేకా హత్య కేసులో పూర్వాపరాలను సమగ్రంగా వివరిస్తూ ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబును దోషిగా పేర్కొంటూ నాటి సాక్షి పత్రికలో   ‘నారాసుర రక్తచరిత్ర’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంను తిప్పికొడుతూ ఈ పుస్తకంను ప్రచురించినట్టు కనిపిస్తున్నది.

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ దీనిని పంపిణీ చేసే విధంగా టిడిపి నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రధాన అస్త్రాలలో ఒకటిగా ఇది ఉండే అవకాశం ఉంది. వేకానందరెడ్డి హత్య విషయం ముఖ్యమంత్రి జగన్‌ దంపతులకు ముందే తెలుసని, హత్య జరిగిన రోజు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లో ఉన్న జగన్‌ దంపతులతో ఫోన్లో పదే పదే మాట్లాడారని పేర్కొంటూ హత్యకు సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలను ఈ పుస్తకంలో వివరించారు.

. ‘జగన్‌కు తెలియకుండా.. ఆయన ఆమోదం లేకుండా పులివెందులలో వివేకా ఇంట్లోకి వెళ్లి కిరాతకంగా చంపే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే జగన్‌ తెలివిగా మొదటిరోజు నుంచే ఈ హత్యను చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ నిజాలు బయటకు రాకుండా తొక్కిపట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. సీబీఐ చేతులు కట్టివేయడానికి కూడా పడరాని పాట్లు పడ్డారు’ అంటూ ఈ పుస్తకం దుయ్యబట్టింది.

జగన్‌కు సిగ్గుంటే ఈ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసిన రోజే రాజీనామా చేసి ఉండాల్సిందని బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు. ‘ఈ కేసు దర్యాప్తుపై వివేకా కుమార్తె సునీత ప్రశ్నిస్తే అవినాశ్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని.. తనపై 11 బదులు 12 కేసులు అవుతాయని జగన్‌రెడ్డి ఆమెతో అన్నారు. తామే హత్య చేసి చంద్రబాబుపై రుద్ది ఎన్నికల్లో సానుభూతి పొందడానికి ప్రయత్నించారు’ అని నక్కా ఆనందబాబు విమర్శించారు.

కడప ఎంపీ సీటు విషయంలోనే హత్య జరిగిందని షర్మిల స్పష్టంగా చెప్పారని గుర్తు చేస్తూరాష్ట్రంలో ఇకపై జగన్‌రెడ్డికి ఒక్క మహిళ ఓటు పడినా అది మహిళా లోకానికే అవమానమని అనురాధ హెచ్చరించారు.

‘70 ఏళ్ల వృద్ధుడు, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని మూడు గంటలపాటు చిత్ర హింసలు పెట్టి చంపారు. ఈ హత్యపై అనేక డ్రామాలు నడిపారు. గుండెపోటుతో చనిపోయారని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. జగన్‌ కుటుంబ టీవీలో గుండెపోటు మరణం అని అనేక గంటలపాటు స్ర్కోలింగులు నడిపారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వచ్చి హత్య ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు’ అంటూ అచ్చెన్ననాయుడు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

`హత్య విషయం బయటకు వచ్చాక నెపం చంద్రబాబుపై తోసి సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. సీబీఐ దర్యాప్తులో ఇప్పుడు వేళ్లన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈ హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదుర్చుకున్నట్లు చెప్పారు. రూ.40 కోట్లు ఇచ్చే ఆర్థిక శక్తి ఎవరికి ఉంది? దీనిని బట్టే ఎవరి పాత్ర ఉందో తెలిసిపోతోంది. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకుని జైలుకు పంపకపోతే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం సడలిపోతుంది’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.

‘కడప ఎంపీ టికెట్‌ తనకు గానీ.. జగన్‌ జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేసిన షర్మిలకు గానీ.. వైఎస్‌ భార్య విజయలక్ష్మికి గానీ ఇవ్వాలని వివేకా పట్టుబటారు. అది అవినాశ్‌రెడ్డికి.. అంతఃపురానికి ఇష్టం లేదు. అందుకే హత్య జరిగింది. ఈ విషయంపైనే ఆ రోజు రాత్రి లోట్‌సపాండ్‌కు, పులివెందులకు మధ్య పదేపదే ఫోన్ల సంభాషణలు జరిగాయి. జగన్‌ దంపతులకు తెలిసే ఈ హత్య జరిగింది’ అని వర్ల రామయ్య ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles