వైఎస్ అవినాష్ రెడ్డికి, తండ్రికి సీబీఐ మరోసారి నోటీసులు

Wednesday, December 18, 2024

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిబిఐ  కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి శనివారం మరోసారి నోటీసులు జారీ చేసింది. అదే విధంగా తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. గత నెల జనవరి 28వ తేదీన అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

కేసుకి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలతో పలువురుకి సీబీఐ వరుసగా నోటీసులు జారీ చేస్తోంది. అనుమానితులు, సాక్షులని విచారించి మరింత సమాచారం రాబడుతోంది. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు పంపింది. కడపలో ఉన్న ఎంపీకి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అధికారులు  ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.

అయితే, భాస్కరరెడ్డిని వయస్సు రీత్యా పులివెందులలోనే ఈ నెల 23న విచారిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. కానీ, ముందు అనుకున్న కార్యక్రమాల దృష్ట్యా ఆ రోజు తనకు తీరికలేదని భాస్కరరెడ్డి తలిపారు. ఇప్పటికే రెండు సార్లు భాస్కరరెడ్డిని సిబిఐ విచారించింది.

160 సీఆర్పీసీ మేరకు జారీ చేసిన నోటీసుల ప్రకారం ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు.వివేకా హత్య కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటి సారిగా ఈ ఏడాది జనవరి 28న విచారించారు. 

దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించిన అధికారులు అవినాశ్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పదుల కొద్దీ ప్రశ్నలు సంధించారు. రక్తపు మరకలు తుడిచిన విషయం తెలుసా?  వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారని సమాచారం. అలాగే, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్ పైనా ఆరా తీశారు. 

ఆయన కాల్ డేటా ఆధారంగా  ఫిబ్రవరి మొదటి వారంలో కడపలో వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్, సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సీబీఐ దాదాపు ఆరున్నర గంటల పాటు ప్రశ్నించింది. వారి నుంచి కూడా కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

నవీన్, కృష్ణమోహన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎంపీ అవినాశ్ రెడ్డిని మరోసారి విచారించాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారు వెల్లడించిన పలు అంశాలను ఆయన ముందు ఉంచి… వివరణ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే… ఫిబ్రవరి 24న మరోసారి విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

మరోవైపు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరారు. దీంతో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles