వెంకయ్యనాయుడు సాన్నిహిత్యమే సత్యకుమార్ కు శాపంగా మారిందా!

Friday, November 22, 2024

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరిని నియమించే విషయమై బీజేపీలో పలు నాటకీయ పరిణామాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఈ పదవి కోసం పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ గత కొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబోతున్నట్లు రెండు నెలలుగా `మీడియా లీక్’లు కూడా ఇస్తున్నారు.

మొన్న మంగళవారం పురందేశ్వరిని నియమించిన రోజు మధ్యాహ్నం వరకు సత్య కుమార్ ను నియమించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ వార్తలు తెలుసుకొని తిరిగి రావడానికి సిద్ధం కూడా అవుతున్నారు.  అయితే అంతలో పురందేశ్వరి పేరు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

ఒక వంక ఎన్నికల వరకు తనను ఈ పదవి నుండి తీయరులే అనే ధీమాతో సోము వీర్రాజు ఉండగా, సత్య కుమార్ కనై పక్షంలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ వంటి వారిని నియమించవచ్చని మీడియా కధనాలు వస్తున్నాయి. కానీ ఎక్కడా పురందేశ్వరి పేరు మాత్రం రావడం లేదు.

సత్య కుమార్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు సన్నిహితుడు కావడంతో, ఆయన ఇచ్చిన భరోసాతోనే ఆ విధంగా `మీడియా లీక్’లు ఇచ్చి ఉండే అవకాశం ఉంది. పురందేశ్వరి సహితం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు గ్రహిస్తున్న ఆమె కూడా అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

అయితే, కొత్త అధ్యక్షుల నియామకం ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు ఈ విషయం వెళ్లిన్నప్పుడు ఆయన సత్య కుమార్ నీయమకంకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కూడా విముఖత వ్యక్తం చేశారు. దానితో అమిత్ షా చేసిన ఎంపిక తలకిందులైన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత సహాయకునిగా పనిచేయడం, ఆయన ఆర్ధిక, రాజకీయ వ్యవహారాలను చూస్తుంది వ్యక్తి కావడంతో సత్య కుమార్ ను నియమించడం తిరిగి ఏపీ బీజేపీ పగ్గాలు వెంకయ్యనాయుడుకు ఇచ్చిన్నట్లు కాగలదని ప్రధాని భావించారని భావిస్తున్నారు.

బిజెపిని టిడిపికి సన్నిహితంగా తీసుకెళ్లి, ఏపీలో ఎదుగు బొదుగూ లేకుండా చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నట్లు భావిస్తున్న వెంకయ్య నాయుడును క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచడం కోసమే ఉపరాష్ట్రపతిగా చేశారనే ప్రచారం జరిగింది. ఆ పదవీకాలం ముగిసిన తర్వాత పార్టీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంచుతున్నారు.

వాస్తవానికి వెంకయ్యనాయుడు మద్దతు దారులుగా పేరొందిన ఒక బృందం రెండు నెలల క్రితం సుజనా చౌదరి ప్రోత్సాహంతో ఢిల్లీ వెళ్లి, పార్టీ ఏపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న కేంద్ర మంత్రి మురళీధరన్ ను కలసి సోము వీర్రాజు వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసి వచ్చారు. ఆ సమయంలో మురళీధరన్ వారికి కనీస మర్యాద ఇవ్వకుండా అవమానకరంగా చూసారని చెబుతున్నారు.

సోము వీర్రాజు, రాష్త్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక బృందంగా వ్యవహరిస్తూ  వెంకయ్యనాయుడు మద్దతుదారులు అందరిని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచుతూ వస్తున్నారు. వారందరికీ సత్యకుమార్ ఒక విధంగా నేతృత్వం వహిస్తున్నారు. అందుకనే సత్యకుమార్ ను నియమించడం ద్వారా ఏపీ బిజెపి వ్యవహారాలలో వెంకయ్యనాయుడు జోక్యంకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ప్రధాని భావించారని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles