సొంతంగా పోటీచేస్తే ఏపీలో బీజేపీ ఒక సీట్ కూడా గెల్చుకోలేదని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకె చెప్పానని, అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని అంటూ మొదటి నుండి బీజేపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోని అవినీతిని, అక్రమాలను తీవ్రంగా విమర్శిస్తున్న ఆ పార్టీ మాజీ శాసనసభాపక్ష నేత, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుపై వేటు వేసేందుకు బిజెపి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
జగన్ ను ఓడించాలంటే టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవాల్సిందే అంటూ మొదటినుండి వాదిస్తున్న ఆయనకు `పార్టీ ధిక్కార ధోరణి’ ఆవలంభిస్తున్నారంటూ బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎందుకు తప్పించకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొంది.
ఇవాళ సాయంత్రంలోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదంతా ఆయనను పార్టీ నుండి సాగనంపేందుకు అని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ ను గద్దె దించాలని, టిడిపితో పొత్తు పెట్టుకోవాలని కోరుకొనేవారిని పార్టీ అధిష్ఠానం సహించదని సంకేతం తద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
అన్నింటికీ మించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి పట్ల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తాజాగా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె’ ఇంటర్వ్యూలో పేర్కొనడం బీజేపీ అధిష్టానంకు ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తున్నది. కేవలం రూ 200 కోట్ల అవినీతి జరిగిన్నట్లు చెబుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉపముఖ్యమంత్రితో సహా అనేకమంది ప్రముఖులను అరెస్ట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీలో ప్రతి నెల వేలకోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటీవల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో విశాఖలో బీజేపీ ఓటమి అనంతరం `ప్రజలు వైసీపీ – బిజెపిలను ఒకటిగానే చూస్తున్నారు అంటూ తీవ్రమైన వాఖ్యలు చేశారు. రెండుసార్లు తెలంగాణ హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చని చెప్పిన కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ అరెస్ట్ చేయకపోవడం సహితం కేంద్ర ప్రభుత్వం జగన్ పట్ల చూపుతున్న ప్రేమ అన్నట్లుగా ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పొత్తులపై మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారనే అభియోగంపై బిజెపి షోకాజ్ నోటీసు జారీ చేసింది. పొత్తులపై వివిధ సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలతో బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన్నట్లు తెలుస్తున్నది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
విష్ణుకుమార్ రాజు మరోసారి ఏపీలో జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరే సమయంలో గుంటూరు వెళ్లి ఆయన్ను కలిసారు. పార్టీని వీడిన వ్యక్తి వద్దకు వెళ్లి కలవటం తో బీజేపీ చర్చకు దారి తీసింది.
2014 ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. అసెంబ్లీలో బీజేపీ బాణీని బలంగా వినిపించిన విష్ణుకుమార్ రాజు ఈ మధ్య కాలంలో టీడీపీకి అనుకూలంగా తన వాణిని వినిపిస్తున్నారని బీజేపీ నాయకత్వం భావిస్తున్నది.
విష్ణుకుమార్ రాజు కొంత కాలంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదన ఉంది. టీడీపీలో అధికారికంగా చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.