విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో కేసీఆర్ తోకముడిచారా!

Sunday, December 22, 2024

విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతూ వర్కింగ్ కాపిటల్ కు పిలిచిన బిడ్డింగ్ లో పాల్గొంటున్నట్లు హడావుడి చేసిన తెలంగాణ మంత్రులు తీరా బీడ్ వేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. సింగరేణి కాలరీస్ అధికారులను అక్కడకు పంపడం, వారు రెండు రోజులపాటు ప్లాంట్ అధికారులతో, కార్మికులతో సమాలోచనలు జరిపి ఒక రిపోర్ట్ ను కేసీఆర్ కు అందీయడం జరిగింది.

ఈ లోగా బీడ్ కు గడువు శనివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసినా సింగరేణి కాలరీస్ గాని, తెలంగాణ ప్రభుత్వం నుండి మరెవరైనా గానీ ఎటువంటి బీడ్ దాఖలు చేయలేదు. అయితే బీడ్ దాఖలుకు మరో ఐదు రోజులు గడువు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కోరింది. మొత్తం 22 మంది దాఖలు చేశారు. ఈ లోగా, బీడ్ కు దాఖలు మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. దానితో ఇప్పుడైనా తెలంగాణ బీడ్ లో పాల్గొంటుందా లేదా అన్నది తెలవాల్సి ఉంది.

అయితే, ఈ లోగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ ఒక ప్రైవేటు కంపెనీ ద్వారా బిడ్‌ దాఖలు చేశారు. ఉక్కు పరిశ్రమ సీజీఎం సత్యానంద్‌కు బిడ్డింగ్‌ పత్రాలను అందజేశారు. విశాఖ ప్రజల తరపున తాను బిడ్‌ దాఖలు చేసినట్టు చెప్పారు.

స్టీల్‌ ప్లాంట్‌ కోసం కొత్త విధానం ద్వారా నిధులు సేకరిస్తామని పేర్కొంటూ  క్రౌడ్‌ ఫండింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్ఫర్‌ వంటి విధానాల ద్వారా నిధులు సేకరించే వెసులుబాటు ఉందని చెప్పారు. 8.5 కోట్ల మంది నెలకు రూ. వంద చొప్పున విరాళం ఇస్తే నెలకు రూ. 850 కోట్లు జమ అవుతాయని పెక్రోన్నారు. ఇలా నాలుగు నెలల పాటు గలిగితే స్టీల్‌ ప్లాంట్‌ ను నిలబెట్టిన వాళ్లలో మనం ఉండే అవకాశముందని చెప్పారు. ఆయన ప్రతిపాదనకు కార్మికుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి తొలుత చెప్పినప్పుడు అదంతా తమ క్రెడిట్ అని చాటుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, మంత్రి హరీష్‌ రావులు ఏపీలో అడుగుపెట్టక ముందే బిఆర్‌ఎస్‌ సాధించిన మొదటి విజయంగా దీనిని అభివర్ణించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దని తను ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సైతం గుర్తు చేశారు. అదే విధంగా వైసిపి మంత్రులు సహితం తమ ఘనతగా చెప్పుకొనే ప్రయత్నం చేశారు.  స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నతాధికారులతో జీవీఎల్‌ సమావేశం నిర్వహించి హడావిడి చేశారు. తీరా సాయంత్రంకల్లా  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీకరణ చేసి తీరుతామని మరోసారి కేంద్రం స్పష్టం చేయడంతో వీరంతా షాక్ కు గురయ్యారు.

ఇదిలా ఉండగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని కోరుతూ ఏడాదిన్నరకుపైగా ఉద్యమం చేస్తున్న కార్మికులు తమ మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం రోజుకో విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడంతో ఆగ్రహం చెందుతున్నారు.  దీంతో శనివారం కార్మిక సంఘాల నేతృత్వంలో స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేటు నుండి సింహాచలం అప్పన్న స్వామి సన్నిధి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. కేంద్రానికి సింహాలచల అప్పన్న మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుతూ ఈ పాదయాత్ర ప్రారంభిచామని వారు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles