వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగలేఖను విడుదల చేయడం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టివేసిన్నట్లయింది. పైగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.
విశాఖపట్నంను ఏపీకి కార్యనిర్వాహక రాజధాని అంటూ ప్రచారం చేయడమే కాకుండా, అక్కడి నుండి తనకు పాలన సాగింపబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఈ అంశాన్నే వైసీపీ అభ్యర్థి ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి ఓడిపోయి, అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ అభ్యర్థి మంచి ఆధిక్యతతో గెలుపొందారు.
ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విశాఖపట్నం పరిసరాలలో పెద్ద ఎత్తున భూఅక్రమణలు కొనసాగుతూ ఉండడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంటే సీఎం జగన్ మౌనం వహిస్తుండడం కారణంగా ఉత్తరాంధ్రలో అధికార పక్షం వ్యతిరేక పవనాలు వేస్తున్నట్లు స్పష్టమైంది.
ఇటువంటి సమయంలో ఈ అంశాన్ని కేటీఆర్ లేవనెత్తడం వైసిపి నాయకత్వంకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టిడిపి సహితం ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి తీసుకోవడం లేదు. ఇక ఎట్లాగూ బిజెపి మౌనం వహిస్తున్నది. ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన మొదటి ప్రధానమైన రాజకీయ పార్టీగా ఇప్పుడు బిఆర్ఎస్ నిలిచింది. ఏపీలో రాజకీయ ప్రవేశం పట్ల ఆసక్తి చూపుతున్న బిఆర్ఎస్ కు ఈ అంశం కీలకమైన ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉంది.
స్టీల్ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెట్‌ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
నష్టాలు సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ హెచ్చరించారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడి సరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశా. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉదంన్న మంత్రి కేటీఆర్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఉన్నట్లు చెప్పారు. అందుకోసం కలిసొచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామని కూడా ప్రకటించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏపీ హైకోర్టులో కేసు వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే… ముడిసరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్ ను అందించే బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గనాలని లక్ష్మీనారాయణ సూచించారు. కేటీఆర్ తరహాలో వైఎస్ జగన్ కూడా ఇదే వైఖరి తీసుకోవాలని ప్రార్థన అంటూ ఆయన ట్వీట్ చేశారు.