విశాఖ కిడ్నాప్ లో కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్?

Wednesday, January 22, 2025

ఏపీకి రాజధానిగా మారనున్న విశాఖపట్టణంలో అధికార పక్షంకు చెందిన ఎంపీ కుటుంభం సభ్యుల కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైనా జరిగిన జరిగిన తీరుతెన్నుల పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇచ్చిన వివరణ మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది.

తన భార్య, కొడుకు కిడ్నాప్ కు గురైనా ఎంపీ ఎంవివి సత్యనారాయణకు మూడోరోజు వారిని విడిచిపెట్టే వరకు ఆయనకు గాని, కిడ్నాపర్లను వెంటాడుతున్న పోలీసులకు గాని తెలియదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఒక సాధారణ రౌడీ షీటర్ ఇంతటి దురాగతానికి పాల్పడి ఉంటాడా? అనే ప్రశ్న తలెత్తుతుంది.  అసలైన సూత్రధారులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావించాల్సి వస్తున్నది.

ఇదంతా డబ్బు కోసమే జరిగిందని, మరేమీ లేదని అంటూ ఒకవంక ఎంపీ, మరోవంక డిజిపి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుండటం చూస్తుంటే వాస్తవాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నిజంగా డబ్బు కోసమే కిడ్నాప్ చేసిఉంటే, విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎంపీకి ఫోన్ చేస్తారు కానీ ఆయన ఆడిటర్ జీవీకి ఎందుకు ఫోన్ చేశారు? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విస్మయం వ్యక్తం చేశారు.

కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్కుమార్ అనే వ్యక్తికి కిడ్నాప్కి సంబంధం లేదని తోచిపుచ్చారు. ఎన్ఐఏ తో పాటు ప్రధాని మోదీకి విశాఖ కిడ్నాప్ ఘటనపై లేఖ రాస్తానని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ప్రముఖ ప్రజా ప్రతినిధి కుటుంబాన్నే టార్గెట్‌ చేసి, రెండు రోజులు నిర్బంధించారంటే…ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయినా విశాఖ ప్రశాంతంగా ఉందని, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు లేవని డిజిపి స్పష్టం చేస్తున్నారు.

ఈ ఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదని పేర్కొంటూ  రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డిజిపి  చెప్పుకొచ్చారు. కేవలం కత్తితో బెదిరించి, వారిని తాళ్లతో కట్టేసి, ఒక ఎంపీ కుమారుడి ఇంట్లోనే రెండు రోజులకు పైగా దుండగులు మకాం వేయగలిగారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

వారి నుండి బంగారు ఆభరణాలతో పాటు రూ. 1.75 కోట్ల నగదు తీసుకున్న తర్వాత కూడా రెండు రోజులు దాటినా ఇంకా అక్కడే వేచి ఉన్నారంటే మరిదేనికోసమనే ప్రశ్న తలెత్తుతుంది. విశాఖపట్నంలో వైసీపీ పాలనలో వేలకొలది ఎకరాల భూములను బెదిరించి స్వాధీనం చేసుకోవడం యధాలాపంగా జరుగుతుంది.

ఎందరో ప్రముఖులు తమ భూములను నామమాత్రపు ధరకే అప్పచెప్పి ఆ నగరం నుండి నిష్క్రమించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విధంగా భూదందాలు చేస్తున్నవారు స్థానికులు కాదని, ప్రభుత్వ అండతో బయటనుండి వచ్చినవారే అని కూడా అందరికి తెలిసిందే. చివరకు అధికార పార్టీకి చెందిన వారు కూడా అటువంటి బాధితులలో ఉన్నారు.

విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో భూములకు సంబంధించిన వివాదాలను సెటిల్ చేసుకునేందుకు ఎవరైనా కీలక వ్యక్తులు ఈ కిడ్నాప్ కు ఉపక్రమించారా? అందుకోసం రౌడీ షీటర్ ను ఉపయోగించుకున్నారా? పోలీసులు, ఆ ఎంపీ సహితం అసలు సూత్రధారులను బయటపెట్టకుండా రౌడీ షీటర్ పైననే నెపం వేసి చేతులు దులుపు కొంటున్నారా? మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles