విశాఖ ఉక్కుకు జెడి లక్ష్మీనారాయణ చిట్కా వైద్యం!

Sunday, December 22, 2024

ఆంధ్రుల హక్కుగా ఉద్భవించిన విశాఖ ఉక్కును తుక్కుగా కార్పొరేట్ సంస్థలకు కారుచవకగా కట్టబెట్టేందుకు ఒకవైపు భారీ ప్రయత్నాలు సాగుతుంటే, ప్రజా మద్దతుతో అడ్డుకొనే ప్రయత్నం చేయాల్సింది పోయి కొందరు నేతలు చిట్కా వైద్యులుగా మారి తాము అడ్డుకుంటామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ ప్లాంట్ నే తాము కొనుగోలు చేసి, ప్రైవేట్ పరం కాకుండా అడ్డుపడతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవంక, గత ఎన్నికలలో విశాఖ నుండి జనసేన అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి, ఓటమి చెందిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అయితే `క్లౌడ్ ఫండింగ్’ మార్గంతో కొనుగోలు చేస్తాను అంటూ మ్యాజిక్ షో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రయివేటీకీకరణకు అడ్డుకట్ట వేయడానికి సింగరేణి బొగ్గును టిప్పర్లలో తోలడానికి అధ్యయనం చేసి రమ్మని కేసీఆర్ ఏకంగా ఒక బృందాన్నే పంపారు. ప్రసారమాధ్యమాల్లో కర్మాగారాన్నే కొనేంత “బిల్డప్” కూడా ఇచ్చారు.

ఇక జెడి లక్ష్మీనారాయణ అయితే, రెండు తెలుగు రాష్ట్రాలలోని 8.5 కోట్ల మంది ప్రజలు నాలుగు నెలలుపాటు, ఒక్కొక్కరు కేవలం రు.100 చొప్పున విరాళమిస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే పరిరక్షించుకోవచ్చన్న “చిట్కా వైద్యాన్ని” సూచించారు. నిజాయితీగల అధికారిగా ప్రజా జీవనంలోకి వచ్చి నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న ఆయన నుండి ఇటువంటి చావుకబారు ప్రతిపాదన రావడం పలువురికి విస్మయం కలిగిస్తుంది.

వందకు వంద శాతం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తామని, వెనక్కి తగ్గేదేలేదని మోదీ  ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే వీరి చిట్కా వైద్యాలు ఏవిధంగా అడ్డుకుంటాయో అర్థం కావడం లేదు.  విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దాగుడు మూతల విధానాలను ఎదుర్కోవడం ఈ చిట్కా వైద్యాలు ఏమాత్రం పనికిరావు.

2021-22 లో రూ. 28,500 కోట్ల టర్నోవర్ తో ఉన్న వైజాగ్ స్టీల్ ను విజయవాడ కు చెందిన వెన్స్ఫార ఇంపెక్స్  అనే  పోతిన వెంకట రామారావు యాజమాన్యంతో గల కంపెనీతో కొనిపిచ్చేస్తా అంటూ జెడి లక్ష్మీనారాయణ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు వెన్స్ఫార  ఇంపెక్ ఏమి ఉత్పత్తి చేస్తుందో ఆయనకు తెలుసా? వారు కొన్ని పౌడర్లను తయారు చేస్తారు. వారి వార్షిక టర్నోవర్ రూ 10 కోట్లు. రూ. రెండు లక్షల కొట్ల విలువ కలిగి, సుమారు 6,500 మంది అధికారులు, 12000 మంది రెగ్యులర్ కార్మికులు, 20,000 మంది కాంట్రాక్టు కార్మికులతో, 45 మిలియన్ల స్టీలు తయారీ చేస్తూ, 70 లక్షల  స్టీలు సామర్ధ్యం కలిగిన వైజాగ్ స్టీల్ కంపెనీని ఈ పౌడర్ల తయారీ కంపెనీతో కొనిపిచ్చేస్తావా ?

మరోవంక, ఇప్పటికే విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ వారికి చేరకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం హడావుడి చేస్తున్నారు.

విశాఖపట్టణం నుండి తిరిగి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తాను అంటే ఏ రాజకీయ పార్టీకూడా తమ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. దానితో నైరాశ్యంతో, ఇటువంటి చిట్కాలతో విశాఖ ప్రజల మన్ననలు పొందితే చివరకు బిఆర్ఎస్ అయినా సీట్ ఇవ్వకపోతుందా అనే ఆశలతో ఉన్నట్లున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles