విశాఖలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం రూ 10.80 లక్షల కోట్ల ఒప్పందాలు ..ఓ బూటకం!

Tuesday, November 5, 2024

విశాఖలో రెండు రోజుల పాటు జరిపిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో కుదుర్చుకున్నట్లు చెబుతున్న రూ 13 లక్షల కోట్ల ఒప్పందాలలో సింహభాగం రూ 10.80 లక్షల కోట్ల మేరకు రెన్యుబుల్ ఎనర్జీ కోసం కుదుర్చుకున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇంతటి భారీ పెట్టుబడులతో విద్యుత్పత్తికి ఒప్పందాలు జరిగితే, ఇందులో 20 వేల మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం, 1,80,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెబుతున్నారు. ఎటువంటి కసరత్తు చేయకుండా కేవలం ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది.

పైగా, ఇవన్నీ ఉత్తుత్తి ఒప్పందాలు కాదని, వారం, వారం సమీక్షించి అమలుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అయితే నిజంగా అన్ని పెట్టుబడులు వచ్చినా ఆమేరకు విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన సదుపాయాలు కల్పించడం రాష్ట్రంలో సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆమేరకు ఉత్పాదన చేపట్టినా, అంత విద్యుత్ వినియోగిన్చుకోనే అవసరాలు ఇప్పట్లో కలగవని కూడా తేల్చి చెబుతున్నారు.

రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లో భాగంగా ఒకొక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నాలుగున్నర ఎకరాల భూమి చొప్పున కావాలని ఈ రంగంలో ఏమాత్రం అనుభవం ఉన్నవారికైనా అర్థం అవుతుంది. అంటే,  రెండు లక్షల మెగావాట్లకు గాను 9 లక్షల నుంచి 9.5 లక్షల ఎకరాల మేరకు భూమి అవసరం కాగలదు.

ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చాలంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వమే సమీకరించి అందించవలసి ఉంటుంది. అంతటి భూమిని ఎక్కడినుంచి తీసుకు రాగలరు? స్థల సేకరణకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి? రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూమిని గుర్తించారు??. అందులో ఎంత భూమిని సేకరించి ఉంచారు? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గతంలో అదాని కంపెనీకి సీలేరు వద్ద అటవీ భూమిని కేటాయించగా, అటవీ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూమి పెద్దగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణాలకే అవసరమైన భూమిని సేకరించలేక పోతున్నారు. అంతభారీగా, భూములు సేకరించేందుకు అవసరమైన ఆర్ధిక వనరులు ప్రభుత్వం వద్ద ఉన్నాయా?

భూసేకరణ సమస్యను అట్లా ఉంచితే, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?. రాష్ట్రంలో ప్రస్తుతం 12 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అనుకుంటే, రానున్న 10 ఏళ్లలో పది శాతం చొప్పున విద్యుత్ అవసరాలు పెరిగిన మరో వెయ్యి మెగావాట్లకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఈ లెక్కన 20 వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర ప్రజల వినియోగానికి అవసరం కాగలదు.

రాష్ట్ర ప్రజలకు 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఒప్పందాలను కుదుర్చుకుంది . ఈ ఒప్పందాలకు పిపిఏలుగా చేసుకుంటారా?, పిపిఏలు చేసుకోము… కానీ, భూమిని మాత్రమే ఇచ్చి ప్లాంట్లు పెట్టుకోమని చెబుతారా?? ప్రభుత్వం వద్ద ఎటువంటి స్పష్టత ఉన్నట్లు లేదు.

 రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని, ఆ కంపెనీలతో విద్యుత్ బోర్డ్ పిపిఏ చేసుకుంటుందా?. భూమి అనేది రాష్ట్ర వనరు. విద్యుత్ కంపెనీలతో పిపిఏలు చేసుకోవు. రాష్ట్ర ప్రజలకు అవసరం లేని విద్యుత్ కోసం భూమి ఇవ్వడం వల్ల, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటి??

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 10% విద్యుత్ ను రాష్ట్ర అవసరాల నిమిత్తం ఉచితంగా ఇవ్వాలని ఒప్పందంలో భాగంగా అడిగారా? అంటే అడగలేదు. ఎలక్ట్రిసిటీ ప్లాంట్ల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి దమ్మిడి ఆదాయం ఉండదు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై ట్యాక్స్ వేయడానికి వీలు లేదు.

ఒక్కొక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5 కోట్ల ఖర్చు అయితే, సివిల్ వర్క్ కు కేవలం రూ. 40 నుంచి రూ. 50 లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. సివిల్ పనులపైన మాత్రమే పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.

అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు ద్వారా రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వ్యవసాయ భూములతో పాటు, అటవీ భూములను కూడా అప్ప చెప్పాల్సిన దుస్థితి నెలకొంటుంది.

విద్యుత్ ఉత్పత్తి జరిగితే, దాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 నుంచి 14 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. మరో నాలుగైదు పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన, 736 కేవీ లైన్లు వేస్తే, మరో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సౌకర్యం లభిస్తుంది.

రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు దేశంలోనే గ్రిడ్ సౌకర్యం లేదని ఈ రంగంలో విశేష అనుభవంగల నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి జరిగినా, కొనుగోలుకు డిమాండ్ లేదని… సరఫరా చేయడానికి సౌకర్యాలు లేవని చెప్పారు. రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ సరఫరా కు ఎన్ని టవర్లు, ఎన్ని లైన్లు వేయాల్సి ఉంటుందో తెలుసా? అంటూ సీఎం వైఎస్ జగన్ ను ఎద్దేవా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles