వివేక్ హత్య కేసులో సిబిఐ వేలిముద్రల పరీక్ష

Wednesday, December 18, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వేగంగా అడుగులు వేస్తుంది. దర్యాప్తు పతాకస్థాయికి చేరుకొంటున్న సమయంలో సరికొత్త పరిణామాలు జరుగుతున్నాయి. ఒక వంక, వివేకానందరెడ్డి హత్య గురైన స్థలంలో లభించిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష జరిపించాలని సిబిఐ నిర్ణయించింది.

మరోవంక, ఈ కేసులో సిబిఐ దర్యాప్తును సీబీఐ ప్రత్యేక కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ వివేకా కుమార్తె డా. సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు కావడం, కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు విధించిన గడువు జూన్ చివరి వరకే కావడంతో ఆమె వేసిన పిటీషన్ ను సిబిఐ కోర్టు తిరస్కరించడంతో, ఆమె అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయించారు.

వేలిముద్రల పరీక్షకు సీబీఐ అధికారులు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. వివరాలు.. 2019 మార్చి 15న పులివెందులలోని తన సొంత నివాసంలో జరిగిన వైఎస్ వివేకా వివేకా హత్య స్థలంలో వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న లేఖ లభించింది. ఈ లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న ఢిల్లీలోని సీఎఫ్‌ఎస్‌‌ఎల్‌కు పంపింది.

పరీక్షల అనంతరం వివేకా ఒత్తిడిలో లేఖ రాసినట్టుగా సీఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. తాజాగా ఈ లేఖపై వేలిముద్రలను సేకరించేందుకు సీబీఐ సిద్దమైంది. ఈ క్రమంలోనే లేఖపై ఉన్న వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్ పరీక్ష చేయాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ సూచించింది.

పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య స్థలంలో లభించిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతివ్వాలని కోరారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని తెలిపారు.

లేఖపై రాత, ఇంకు దెబ్బతింటే.. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కూడా కోరారు. ఇక, అయితే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్‌పై సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీన విచారణ చేపట్టనుంది.

ఇదిలా ఉంటే ఈ లేఖ గురించే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సీబీఐ అధికారులు ఈ లేఖకు సంబంధించి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకును కూడా విచారించారు.

ఈ కేసు విచారణ, అరెస్ట్ ల విషయంలో సీబీఐకి పూర్తి స్వేఛ్ఛ ఉన్నట్టు హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నా  ఏదో ఒక పిటీషన్ తో దర్యాప్తు ఆలస్యం అయ్యేటట్లు అవినాష్ రెడ్డి ప్రయత్నం చేస్తుండడంతో డా. సునీత సిబిఐ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరినట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles