వివేకా హత్య గురించి రోజుకో కథనం ప్రచారం!

Saturday, January 18, 2025

“కడప ఎంపీ టికెట్‌ కోసమే వివేకా హత్య జరిగింది! ఈ కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి అనుమానితులు” అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్ చేపట్టిన సీబీఐ బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ విషయాన్నీ నేరుగా తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టుకు కూడా దర్యాప్తు వివరాలు అందించింది. దర్యాప్తు సక్రమంగానే జరుగుతున్నట్లు హైకోర్టు సంతృప్తి కూడా వ్యక్తం చేసింది.

కానీ, అప్పటి నుండి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారు మాత్రం హత్యకు సంబంధించి పూటకో కధనాన్ని ప్రచారం చేస్తున్నారు. పరస్పరం విరుద్ధమైన వాదనలు తెరపైకి తీసుకు వస్తున్నారు. తద్వారా దర్యాప్తులో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వెల్లడవుతుంది. 

నేరుగా హైకోర్టు ముందే వారు వినిపించిన వాదనలు వింటుంటే వివేకానందరెడ్డిని ముగ్గురు వేర్వేరు వ్యక్తులు మూడు వేర్వేరు కారణాలతో చంపినట్లు భావించవలసి వస్తుంది. నిందితులు రోజుకో కొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మార్చి 10న తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా సీబీఐని నియంత్రించాలని కోరారు.

ఈ సందర్భంగా వివేకా హత్య గురించి ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలకు ముందే తెలుసని తెలిపారు. ఈ పిటిషన్‌పై మార్చి 13న సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ప్రధాన అనుమానితులని, వారిని అరెస్టు చేస్తామని పేర్కొంది.

విచారణ కీలక దశలో ఉన్నప్పుడు వారిని అరెస్టు చేయొద్దని గానీ విచారణ నిలిపివేయాలని గానీ ఆదేశాలు ఇవ్వొద్దని, అది మొత్తం విచారణపైనే ప్రభావం చూపిస్తుందని కోర్టును అభ్యర్థించింది.

మార్చి 13న అవినాశ్‌రెడ్డి అదనపు అఫిడవిట్‌ దాఖలుచేశారు. అందులో వివేకా హత్యలో మరో కోణం చూపించారు. వివేకాకు ముస్లిం మహిళతో సంబధాలున్నాయని, వారికి కలిగిన కుమారుడికి వారసత్వం వెళ్లకూడదని, ఆస్తుల విషయంలో కూతురు, అల్లుడూ వివేకాను దూరం పెట్టారని తెలిపారు.

వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వారసత్వం హక్కులు ముస్లిం మహిళ కుమారుడికి వెళ్లకుండా వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిలే దస్తగిరికి సుపారీ ఇచ్చి ఉంటారని అందులో అనుమానం వ్యక్తం చేశారు.

ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డి తండ్రి వెఎస్‌ భాస్కరరెడ్డి మంగళవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ సునీల్‌ యాదవ్‌ తల్లిని వివేకా వేధించారని, అందుకే ఆయన్ను సునీల్‌ హత్యచేశాడంటూ ఇంకో కథనం తెరపైకి తెచ్చారు.

ఈ మొత్తం కేసులో పలు అఫిడవిట్లు, పిటిషన్లను పరిశీలిస్తే ఇప్పటి వరకు మూడు కారణాలతో వివేకాను మూడు సందర్భాల్లో హత్యచేసినట్లుగా కనిపిస్తోంది. తొలుత గుండెపోటుతోనే చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వమ్ము కావడంతో ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు.

సీబీఐ విచారణ మొదలయ్యాక ఆస్తి కోసం వివేకాను కూతురు, అల్లుడే చంపారని ఒకసారి, వారసత్వం ముస్లిం మహిళ కుమారుడికి వెళ్లకుండా అల్లుడు, కూతురు దస్తగిరికి సుపారీ ఇచ్చి హత్యచేయించారని మరోసారి రెండు కోణాలు తీసుకొచ్చారు. ఇప్పుడీ రెండింటికీ భిన్నంగా తన తల్లిని వేధించినందుకే సునీల్‌యాదవ్‌ హత్యచేశాడని తెరపైకి తె చ్చారు.

నిజానికి వైసీపీ నేతలు వివేకా మరణాన్ని తొలుత గుండెపోటుగా చిత్రించారు. హత్య అని తేలాక టీడీపీ అధినేత చంద్రబాబే చంపించారంటూ ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ జగన్‌ సొంత మీడియాలో కథనాలు ప్రచురించారు. ఈ విధంగా ఒక వంక దర్యాప్తు సంస్థల దృష్టి మళ్లించడం, విచారణలో జాప్యం జరిగేటట్లు చేయడం లక్ష్యంగా కనిపిస్తుంది.

ఈ నెలాఖరు లోగా దర్యాప్తు పూర్తి చేయమని సుప్రీంకోర్టు నియమించిన సరికొత్త సిబిఐ బృందం ఇప్పటి వరకు రంగంలోకి దిగిన్నట్లు కనిపించడం లేదు. దానితో కీలక నిందితుల అరెస్ట్ ను జాప్యం చేయగలిగారు. మరోవంక ఇందులో `కుట్ర కోణం’ ఛేదింపమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించాయి. ఆ దిశలో అసలు దర్యాప్తు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles