వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్

Sunday, December 22, 2024

ఒక వంక బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిబిఐ దర్యాప్తును నిర్వీర్యం కావించాలని, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరోవంక ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణపై తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఇన్ని రోజులుగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని సీబీఐపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించించింది. విచారణ త్వరగా ముగించ లేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని ధర్మాసనం దష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం..ఈ కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని చెప్పింది. కేసును సోమవారంకు వాయిదా వేసింది.

వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున మార్చాలని పిటిషన్‌లో ఆమె కోరారు. గతంలో రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో నిందితులు కేసు పెట్టారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

మరోవంక, దర్యాప్తును జాప్యం కావించే ప్రయత్నంలో అనుకుంటా తెలంగాణ హైకోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. వివేక హత్య కేసులో ఏ-4 దస్తగిరినీ అప్రూవర్‎గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది.

కాగా.. దస్తగిరినీ అప్రూవర్‎గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు” అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పైగా, కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదంటూ  వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే అంటూ గుర్తు చేశారు. బెయిల్ సమయంలోను సీబీఐ అతనికి సహకరించిందని, దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని తెలిపారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‎ను రద్దు చేయాలిఅని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

సిబిఐ దర్యాప్తు తీరుపై దాదాపు ఇటువంటి అభ్యంతరాలనే వ్యక్తం చేస్తూ భాస్కరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన కొద్దీ రోజులకే దాదాపు అటువంటి ఆరోపణలతోనే మరో పిటీషన్ ను తండ్రి దాఖలు చేయడం గమనార్హం. అటు సుప్రీంకోర్టులో, ఇటు హైకోర్టులో సిబిఐ దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, దర్యాప్తు అధికారిని మార్చేవిధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

అయితే దర్యాప్తుకు సంబంధించి సిబిఐ సమర్పించిన పత్రాలు, వీడియోలను పరిశీలించిన హైకోర్టు సంపూర్తి వ్యక్తం చేయడం, దర్యాప్తు సక్రమంగానే సాగుతున్నట్లు స్పష్టం చేయడం గమనార్హం. పైగా, అవసరం అనుకొంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయవచ్చని తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles