ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలు ఆధారాలు తన ప్యాలెస్ వైపుకు చూపుతూ ఉండడంతో ఆత్మరక్షణలో పడ్డ జగన్ తాజాగా ఈ కేసులో తమ వాదనలను వినాలంటూ వివేకా భార్య సౌభాగ్య, కుమార్తె డా. సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో కలవరం చెందుతున్నట్లు తెలుస్తున్నది.
ఈ కేసులో రెండో నిందితుడు సునీల్‌యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతూ వారు ఈ విజ్ఞప్తి చేశారు. వారి ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తూ వారి వాదనలను వింటామని కోర్టు తెలిపింది. వివేకా హత్యకేసుకు సంబంధించి ఏపీ పరిధిలో పారదర్శక దర్యాప్తు జరిగే పరిస్థితి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఏ2గా ఉన్న సునీల్‌యాదవ్ తనకు ఈ హత్యతో ఏ సంబంధం లేదని, తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేకున్ 18 నెలలుగా జైలులో ఉంటున్నానని పేర్కొంటూ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీహెచ్ సుమలత ధర్మాసనం విచారణ చేపట్టింది.
సునీల్‌యాదవ్ తరఫున న్యాయవాది నయన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ అకారణంగా 18 నెలల నుంచి జైల్లో ఉన్నారని, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తరహాలోనే అతనికీ బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే, వివేకా భార్య, కుమార్తె తరఫున న్యాయవాది టి.స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో భర్తను, తండ్రిని కోల్పోయిన తన క్లయింట్లు అసలైన బాధితులని పేర్కొన్నారు.
వివేకా హత్యలో సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించాడని, అతడి బెయిల్ పిటిషన్‌లో తమ వాదనను సైతం పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కేసు ముందుకు సాగకుండా నిందితులు అడ్డుకుంటున్నారనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసేలా ఆదేశాలు తెచ్చుకున్నామని ఆమె గుర్తు చేశారు.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది. అందరి వాదనలు ఒకేసారి వింటామని పేర్కొన్న ధర్మాసనం, విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కాగా, వారి వాదనలు కేవలం ఈ ఒక్కరి నిందితుడి బెయిల్ వరకు పరిమితం కాకపోవచ్చని, తాజాగా సిబిఐ దర్యాప్తులో తెరపైకి వస్తున్న కొత్త పాత్రల గురించి కూడా ప్రస్తావన ఉండవచ్చని భావిస్తున్నారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి హైకోర్టులో సీబీఐ తరఫున ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు న్యాయవాదులు వచ్చారు. ఇప్పటికే హైకోర్టులో సీబీఐ తరఫున నాగేంద్రన్ అనే న్యాయవాది ఉండగా, మరో ముగ్గురు రావడం గమనార్హం..! ప్రత్యేకంగా ఈ ఒక్క కేసులో ప్రాతినిధ్యం వహించడానికి తమను నియమించారని వారు పేర్కొన్నారు.
సునీల్‌యాదవ్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా వివేకా భార్యాబిడ్డల ఇంప్లీడ్ పిటిషన్‌పై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అని సునీల్‌యాదవ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎటువంటి అభ్యంతరాలు లేవని, వారు ఇంప్లీడ్ కావొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే వారు చేసిన ఆరోపణలపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.