వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ ఓఎస్డీ

Thursday, November 14, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బాబాయి కుమారుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలను నిందితులుగా సిబిఐ పేర్కొనడంతో సిబిఐ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్లే అవకాశం ఉండనే కధనాలు వెలువడ్డాయి.

అందుకు బలం చేకూరుస్తూ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలను సిబిఐ ఒక సాక్షిగా పేర్కొన్నది. ఆమెతో పాటు సిఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా సాక్షిగా పేర్కొంది. ఈ మేరకు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని, కోర్టుకు అందించింది. కృష్ణమోహన్‌రెడ్డి వాంగ్మూలంలో కీలక వివరాలు పేర్కొనడం గమనార్హం. 

‘ఓ కీలక సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. సమావేశం నుంచి బయటికి రావాలని నవీన్ నన్ను కోరారు. అవినాశ్ రెడ్డి మాట్లాడతారంటూ నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకానందరెడ్డి మరణించారని అవినాష్ నాకు ఫోన్ లో చెప్పారు’ అంటూ హత్య జరగగానే సీఎం జగన్ కు సమాచారం ఏవిధంగా అందిందో వెల్లడించారు. 

`ఎలా జరిగిందని అవినాశ్ రెడ్డిని అడిగాను. బాత్రూంలో మృతదేహం ఉందని అవినాష్ చెప్పారు. బాత్రూంలో చాలా రక్తం ఉందని కూడా అవినాష్ చెప్పారు. దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వండి అని చెప్పి అవినాష్ ఫోన్ పెట్టేశారు. వివేకా మరణం విషయం నేను జగన్‌కు చెవిలో చెప్పాను. బాత్రూంలో, బెడ్రూంలో రక్తం విషయం కూడా చెప్పాను. జగన్ ముందు ఇంటికి వెళ్లి, ఆ తర్వాత పులివెందుల వెళ్లారు` అంటూ వివరించాడు. 

ఇక, అవినాష్‌తో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారని సిబిఐ అడిగితే బహుశా జగన్ పర్యటన కోసమే అవినాష్‌తో అన్నిసార్లు ఫోన్లో మాట్లాడి ఉంటానని చెప్పాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే జగన్ ఫోన్ వాడరు. పిఎ ఫోన్ లేదా నా ఫోన్ లోనే మాట్లాడతారు అంటూ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వివరించారు. 

అటు, వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ అటెండర్ జి.నవీన్ వాంగ్మూలాన్ని కూడా సిబిఐ నమోదు చేసింది. ‘ఉదయం 6.30 గంటలకు అవినాష్ ఫోన్ చేసి జగన్ ఉన్నారా? అని అడిగారు. కృష్ణమోహన్ రెడ్డి, జీవీడీలతో జగన్ సమావేశంలో ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాష్ కోరారు’ అని చెప్పాడు. 

`దాంతో, సమావేశం జరుగుతున్న గది వద్దకు వెళ్లి, అవినాష్ లైన్ లో ఉన్నారంటూ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు‘ అని నవీన్ తన వాంగ్మూలంలో వివరించారు. కాగా, ఈ వాంగ్మూలాలను సీబీఐ జూన్ 30న కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ సిఎస్ అజేయ కల్లం నుంచి కూడా వాంగ్మూలాలు సేకరించిన సిబిఐ వాటిని కూడా కోర్టుకు సమర్పించింది. కాగా, నిందితులు సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, కడప ఎంపిఅవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి పరిసరాల్లోనూ ఉన్నారని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నట్లు సీబీఐ తన అదనపు ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ప్రాధమిక చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలు తుది చార్జిషీట్ లో మార్పులు చేశామని తెలిపింది.

గతంలో యుటిసి గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలని, గతంలో సమాచార సేకరణలో పొరపాటు జరిగిందని తాజా చార్జిషీట్‌లో సిబిఐ వెల్లడించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles