వివేకా హత్య కేసులో `రహస్య సాక్షి’…. బాంబు పేల్చిన సీబీఐ

Sunday, December 22, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సంబంధించిన కీలక నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో సిబిఐ వరుసగా బాంబులు పేల్చినట్లయింది.  హత్య గురించి ముందే తెలుసంటూ అఫిడవిట్ లో మొదటిసారిగా ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును తీసుకొచ్చి రాజకీయ కలకలం సృష్టించింది. 

జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా సిబిఐ న్యాయవాది కోర్టు ముందు చేసిన వాదనలలో  ఈ కేసులో తమ వద్ద ‘ రహస్య సాక్షి ’ వాంగ్మూలం ఉందని అంటూ సీబీఐ మరో బాంబు పేల్చింది. ఈ రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉందని బట్టబయలైందని వెల్లడించింది.

నిందితులు వ్యాప్తి చేస్తున్నట్లు హత్య వెనుక కుటుంబపరమైన, ఆస్థిపరమైన ఇతర కారణాలు ఏవీలేవని పేర్కొంటూ హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే ఇతర కోణాలు లేవనే వాదనకు ఈ స్టేట్‌మెంట్‌తో తిరుగులేని బలం చేకూరిందని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని, వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగిందని సీబీఐ పేర్కొంది.

అవినాశ్‌ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. ‘‘కడప ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాశ్‌ రెడ్డికి ఇవ్వరాదని వివేకా పట్టుబట్టారు. ఒకవేళ అవినాశ్‌రెడ్డికే ఇస్తే తాను వైసీపీని వదిలేసి టీడీపీలో చేరుతానని వివేకా హెచ్చరించారు” అంటూ హత్యకు దారితీసిన పరిస్థితులపై సిబిఐ వివరించింది.

కడప ఎంపీ టికెట్‌ తనకే కావాలని వివేకా పట్టుబట్టలేదని, అయితే షర్మిల లేక విజయలక్ష్మికి ఇవ్వాలని కోరారని చెబుతూ కడప ఎంపీ స్థానం నుంచి పోటీచేయడానికి వివేకా ఆ ఇద్దరిలో ఒకరిని ఒప్పించారు కూడా అని సీబీఐ తెలిపింది. కావాలంటే అవినాశ్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని వివేకా సూచించాడని అంటూ హత్య జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అవినాష్ రెడ్డిని కడప నుండి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని సిబిఐ గుర్తు చేసింది.

“హత్య వెనుక అనేక కోణాలు ఉన్నాయనే థియరీని నిందితులు ప్రచారం చేస్తున్నారు. కానీ, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉన్నదనేందుకు మా వద్ద ఆధారాలు ఉన్నాయి’’ అంటూ అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ స్పష్టం చేసింది.

అవినాశ్‌ను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉందని చెబుతూ అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాశ్‌రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్ధతి ప్రకారం చేస్తాం కానీ అవినాశ్‌ కోరుకున్నట్లు కాదని సీబీఐ తరపు లాయర్‌ అనిల్‌ కోర్టుకు స్పష్టం చేశారు.

అరెస్ట్ లో జాప్యంపై నిలదీసిన న్యాయమూర్తి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా సిబిఐ ఇంత డ్రామా ఎందుకు ఆడుతున్నడని అంటూ ఒక విధంగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.  ‘నోటీసు ఇవ్వాల్సిన అవసరమేముంది? నేరుగా అరెస్టు చేయలేకపోయారా?’ అని ప్రశ్నించారు.

అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని ఎలాంటి రక్షణ ఆదేశాలూ అమలులో లేనప్పుడు ఎందుకు అరెస్టు చేయడం లేదు? నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేరుగా అరెస్టు చేస్తే ఇంత డ్రామా ఉండేది కాదు కదా! అవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఎలా అరెస్టు చేశారో ఆయన్నూ అలాగే అరెస్టు చేస్తే సరిపోయేది కదా? అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇప్పటికైనా సీబీఐ తెలివైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ సమాధానమిచ్చారు. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు కోసం ఈ నెల 31కు వాయిదా వేశారు. తల్లి అనారోగ్యం దృష్ట్యా అప్పటివరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles