వివేకా హత్య కేసులో మొదటిసారి  జగన్ పేరు ప్రస్తావించిన సిబిఐ

Wednesday, January 22, 2025

ఏపీలో రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ న్యాయస్థానాలలో దాఖలు చేస్తున్న అఫిడవిట్ లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సంచలనం బయటపడుతున్నది. తాజాగా సిబిఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో సిబిఐ మొదటిసారిగా సీఎం జగన్ పేరు ప్రస్తావించడం గమనార్హం.

తన బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురైనట్లు ఆ రోజు రాత్రే ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసని అంటూ సిబిఐ వెల్లడించింది.  వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు వాడిగా, వేడిగా జరిగిన వాదోపవాదనలు మధ్య సిబిఐ  తాజాగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించింది.

తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలుసని సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది. వివేకా హత్య జగన్ కు అందరికంటే ముందుగా తెలుసని పేర్కొంది. దీంతో హైకోర్టు అవినాష్ రెడ్డి చెప్పారా? అని ప్రశ్నించింది. ఆ విషయం దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది.

ఈ వ్యవహారంపై వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఆయన సహకరించడం లేదని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో సీబీఐ పేర్కొంది. తొలుత పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, ఆ తర్వాత ముందుగా కమిట్ అయిన పనులు ఉన్నాయని, ఆ తర్వాత తల్లికి అనారోగ్యం ఉందని సీబీఐ విచారణకు అవినాష్ రాలేదని పేర్కొంది.

ఆ తర్వాత తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పినట్లు వెల్లడించింది. ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే అవినాష్ కస్టోడియల్ విచారణ అవసరమని తెలిపింది. అలాగే వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 వరకూ అవినాష్ వాట్సాప్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నారని, వివేకా హత్య గురించి పీఏ కృష్ణారెడ్డి ఉదయం 6.15కు బయటపెట్టడానికి ముందే సీఎం జగన్ కు సమాచారం వెళ్లిన్నట్లు సీబీఐ తెలిపింది.

ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించింది. అలాగే ఇతర నిందితులు, వారి పాత్రపైనా సీబీఐ పలు సంచలన అంశాలు హైకోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై శనివారం సీబీఐ వాదనలు వినిపించబోతోంది.శుక్రవారం  అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించగా, డా. సునీత తరపు న్యాయవాది సుమారు గంటసేపు వాదనలు వినిపించారు. తిరిగి శనివారం  ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles