సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సీబీఐ ముందు మే 5 వరకూ లొంగిపోకుంటే, గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ముందు మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరించారని.. ఆయన బయట ఉంటే సాక్షులు భయపడుతున్నారని సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. గంగిరెడ్డిపై 2021లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ ఏ1గా చేర్చింది. ఆయన ఆదేశాలతోనే వివేకా హత్య జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో గంగిరెడ్డి వివేకా ఇంట్లోనే ఉన్నట్లు కూడా నిర్ధారణకు వచ్చింది. అయితే గంగిరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత 90 రోజులకూ సీబీఐ ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దీంతో గంగిరెడ్డికి అప్పట్లో బెయిల్ లభించింది.
కాగా, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని జూన్ 30వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జులై 1న గంగిరెడ్డి కి బెయిల్ మంజూరు చేయాలంది. లక్షన్నర షూరిటీలతో బెయిల్ ఇవ్వాలని కోర్టు సూచించింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ1గా ఉండటంతో.. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దాదాపు రెండు నెలలుగా వాదనలు కొనసాగాయి. ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటంపై సీబీఐ అభ్యంతరం తెలిపింది..
బెయిల్ రద్దుపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడంలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు గురువారంకు వాయిదా వేసింది.
గతంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టున సీబీఐ ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే అప్పటికే వివేకా కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ మేరకు ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ… తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.