వివేకా హత్య కేసులో ఆర్ధిక వనరులపై గుచ్చి గుచ్చి ప్రశ్నించిన సిబిఐ

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డిని ఐదవసారి బుధవారం విచారించిన సీబీఐ ప్రధానంగా అందుకోసం భారీగా ఆర్ధిక వనరులను ఏ విధంగా సమకూర్చే ప్రయత్నం జరిగినదని అంశంపై గుచ్చి, గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దాదాపు 8 గంటలపాటు ఆయన్ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు తిరిగి గురువారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ రావాలని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈనెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ  విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు సూచనల మేరకు రాత పూర్వకంగా ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అవినాష్‌ విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశించడంతో ఈ మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్‌ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో విచారణ ద్వారా సీబీఐ తమకు కావాల్సిన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కోర్టులో జరిగిన వాదనల్లో వివేకా హత్య కేసు డీల్‌ రూ.40 కోట్లుగా సీబీఐ పేర్కొంది.

 దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో, దీని చుట్టూనే సీబీఐ నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. సునీల్‌ యాదవ్‌ బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ జరిగినట్లు సీబీఐ చెబుతూ వచ్చింది. ఎక్కడ నుంచి ఈ నగదు వచ్చింది? ఎవరెవరు కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చారనే సమాచారం పైన తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

హత్యలో అవినాష్‌ ప్రమేయం ఉందని కోర్టులో సీబీఐ వాదించింది. ఆధారాల టాంపరింగ్‌ జరిగినట్లు ఆరోపించారు. నిందితులతో ఉన్న సంబంధాలపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. అటు అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డిని, హత్య కేసులో మరో నిందితుడు ఉదయ్‌కుమార్‌ను న్యాయవాదుల సమక్షంలో విచారించారు.

మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టు అయిన అవినాష్ తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను కూడా సీబీఐ అధికారులను విచారించారు. వీరిద్దర్నీ దాదాపు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించారు. వివేకా హత్యకు దారితీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపైనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.

 మరోవంక, ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది అన్న దాటి చుట్టూనే పదే పదే ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అవినాష్ ని పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. వివేక్ ఇంటికి రాకముందు మీరు ఎవరెవరిని కలిసారని ప్రశ్నించారని సమాచారం.

ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్లంతా మీతో ఎందుకు సమావేశమయ్యారని పేరు పేరునా వివరాలు అడినట్టు తెలుస్తోంది. అలాగే తాము అడిగిన ప్రశ్నలకు జవాబులను సైతం రాతపూర్వకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అవినాష్ విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించినట్టు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles