వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడే…సిబిఐ స్పష్టం!

Saturday, January 18, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడేనంటూ సీబీఐ స్పష్టంగా ప్రకటించింది. ఈకేసులో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటికీ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి తప్పించుకొనే ప్రయత్నం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేసింది.

పైగా, హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత మాత్రమే తాను సీబీఐ విచారణకు హాజరవుతానని వెల్లడించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. చారణకు అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారంటూ  సిబిఐ హైకోర్టులో తన వాదనలు వినిపించింది.

ఈకేసు విచారణ ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తు చేస్తూ ఈ విధంగా విచారణను అడ్డుకొంటుంటే యెట్లా అంటూ ప్రశ్నించింది.  అయితే, అంతకు ముందు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా ఇరికిస్తున్నారని మీడియా ముందు అవినాష్ రెడ్డి మరోసారి మొరపెట్టుకున్నారు.

ఈకేసులో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేయగా, ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. పైగా,  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సిబిఐ తన దగ్గర ఉంచుకోవడంతోనే అతడిని అప్రూవర్‌గా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు.

2021 వరకు సిబిఐ తనని ఛార్జ్‌సీట్‌లో అనుమానితుడి చేర్చలేదని, తనపై నేరం రుజువు చేయడానికి సిబిఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. అంతేకాకుండా, వివేకా కుమార్తె సునీత స్థానిక ఎంఎల్‌సితో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిబిఐ అధికారితో కుమ్మక్కయ్యారని అవినాష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలు పంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టిందన్నారు. వివేకా కుమార్తె సునీత, సిబిఐ స్థానిక ఎంఎల్‌సి ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని, తనని, తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ వేశారని దుయ్యబట్టారు. సునీతకు , వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని, వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు.
మరోవైపు హైకోర్టులో అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం విచారణను సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అందుకు సిబిఐ అంగీకరించింది.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాలను మాయం చేశారనే అభియోగాలపై భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles