వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా!

Wednesday, January 22, 2025

ఎపి సిఎం వైయస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ స్వయంగా పేర్కొనడం కలకలం రేపుతోంది. రెండోసారి, గురువారం దర్యాప్తుకు హైదరాబాద్ లో హాజరుకమ్మనమని నోటీసులు జారీచేసిన సీబీఐ ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పత్రంలో ఈ వివరాలు పేర్కొనడంతో ఇక సీఎం జగన్ కు సన్నిహితుడైన ఈ ఎంపీ అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతుంది.

`వైఎస్‌ వివేకానంద రెడ్డిని వైఎస్‌ అవినాశ్‌ రెడ్డే చంపించారు. దీనిని నిరూపించేందుకు ప్రాసంగిక సాక్ష్యాలన్నీ ఉన్నాయి’… అని సీబీఐ తేల్చిచెప్పింది. వివేకా హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనేక సంచలన సంగతులు బయటపెట్టింది. 68 పేజీలున్న ఈ పిటిషన్‌లో అనేక కీలక వివరాలు వెల్లడించింది.

తన దర్యాప్తులో తేలిన విషయాలను సీబీఐ పూసగుచ్చినట్లుగా ఇందులో వివరించింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే వున్నట్లుగా తన కౌంటర్‌లో తెలిపింది. అవినాశ్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసునని , అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ పాత్ర వుందని స్పష్టం చేసింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ నెల 18న సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సిబిఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇప్పటికే ఇక ఈ కేసుకు సంబంధించి గత నెల 28న అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

సీబీఐ తేల్చిన ప్రకారం… వివేకాను అవినాశ్‌ రెడ్డి అడ్డు తొలగించుకోవాలనుకోవడానికి కారణం… తన ఎంపీ సీటుకు అడ్డు రావడం! వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి (ఏ5)తో కలిసి అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కుట్రపన్నారు. దానిని దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అమలు చేశారు.

దీనికోసం… వివేకాతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ఆయనపై కోపం పెంచుకున్న ఎర్ర గంగిరెడ్డి (ఏ1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (ఏ2), డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి (ఏ4 – అప్రూవర్‌), ఉమాశంకర్‌రెడ్డిలను పోగేశారు. ఈ నలుగురే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు.

గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించడం, రక్తపు మరకలను తుడిపి వేయించడంలో అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పాత్ర గురించి సీబీఐ ఇదివరకే వెల్లడించింది. కడప లోక్‌సభ టికెట్‌ విషయంలో వివేకాతో విభేదాలున్నాయని కూడా తెలిపింది. ఇప్పుడు మాత్రం ‘అవినాశ్‌ రెడ్డే చంపించారు’ అనేందుకు ప్రాసంగిక సాక్ష్యాలూ ఉన్నాయని చెప్పడం విశేషం.

సీబీఐ వెల్లడించిన ప్రకారం… కీలక నిందితుడు సునీల్‌ యాదవ్‌ వివేకా హత్య జరగడానికి ముందురోజు సాయంత్రం అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. ఇతర నిందితులూ/పాత్రధారులూ ఆ రోజు అక్కడ కలుసుకున్నారు. ఇక… వివేకా హత్య జరిగిన రోజు ఉదయం పలువురు నిందితులు అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.

ఎర్ర గంగిరెడ్డి ఇతర నిందితులకు ఇచ్చిన భరోసా మేరకు… వివేకా ఇంటికి వెళ్లి సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు సిద్ధంగా కూర్చున్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి నుంచి ఫోన్‌ రాగానే అక్కడికి వెళ్లి… రక్తపు మడుగును శుభ్రం చేయడం, గుండెపోటు కథను ప్రచారం చేయడం, వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజీతో ‘కవర్‌’ చేయడం వంటివన్నీ చేశారని సీబీఐ తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles