చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యాజమాన్యంలోని `సాక్షి’ మీడియాలో వస్తున్న కథనాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి ఆస్తులపై సంచలన వాఖ్యలు చేశారు.
వివేకా ప్రజల మనిషని పేర్కొంటూ అలాంటి వ్యక్తి గురించి కొన్ని మీడియా హౌస్‌లు పనిగట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని సాక్షి ఛానల్ పేరు ప్రస్తావించకుండా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మీడియా హౌస్‌లకు ఆ అర్హతే లేదని ఆమె స్పష్టం చేశారు.
అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి మీద కొన్ని మీడియా హౌస్‌లు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
వైఎస్ వివేకా రెండో పెళ్లిని హైలైట్ చేస్తూ, ఆమెకు ఆస్తులు రాసి ఇవ్వబోతుంటే ఆస్తుల కోసం సొంత కూతురు, అల్లుడే చంపి ఉంటారని ఈ కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో చేస్తున్న ఆరోపణలను షర్మిల తీవ్రంగా తిప్పికొట్టారు.
ఒక వేళ సునీత భర్త రాజశేఖరరెడ్డి ఆస్తి కోసమే ఇదంతా చేశాడు అంటే అప్పుడు చంపాల్సింది వివేకానందరెడ్డిని కాదు సునీతను చంపాల్సి ఉందని ఆమె ఆమె సంచలన వాఖ్య చేశారు. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ ఫస్ట్ నుంచి సునీత పేరుపైనే ఉన్నాయని ఆమె వెల్లడించారు. చిన్నాన్న వివేకా పేరుపై గాని చిన్నమ్మ పేరుపై గాని ఎప్పుడూ ఆస్తులు లేవని, ఆస్తులన్నీ కూతురు వైఎస్ సునీతపేరుమీద వీలునామా రాశారని ఆమె తేల్చి చెప్పారు.
“సునీత మా చిన్నాన్నకు ఒక్కగానొక్క కూతురు అని.. ఆయన ఆస్తులన్నీ ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. అలాంటప్పుడు ఆస్తుల కోసం, ఇంకెవరికో రాసిస్తాడని హత్య చేశారని అనడంలో అసలు లాజిక్కే లేదు” అని ఆమె స్పష్టం చేశారు. చిన్నాన్న వివేకానందరెడ్డి పేరు మీద ఉన్న అరకొర ఆస్తిని కూడా సునీత పిల్లలకు చెందేలా వీలునామా కూడా రాశారని ఆమె వివరించారు.
వివేకానందరెడ్డిని `స్త్రీలోలుడు’గా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నాన్న వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. “మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఒక ప్రజా నాయకుడు” అంటూ ఆమె సగర్వంగా పేర్కొన్నారు.
జిల్లాలో ఎవరైనా ఆయన దృష్టికి ఏదైనా సమస్యను తీసుకొస్తే.. కలెక్టర్ కార్యాలయానికైనా, చిన్న పంచాయతీ ఆఫీసుకైనా నేరుగా చిన్నాన్నే వెళ్లి పరిష్కరించే వారని షర్మిల చెప్పారు. చిన్నాన్న వివేకానందరెడ్డి ఎలాంటి వారంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రైళ్లలో కూడా ప్రయాణించేవారని తెలిపారు.
అలాంటి వివేకానందరెడ్డి మీద కొన్ని మీడియా సంస్థలు దారుణంగా ప్రచారం చేస్తున్నాయని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేకానందరెడ్డిని ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే చూడాలని వైఎస్ షర్మిల హితవు చెప్పారు.