వివేకా హత్యకేసులో విస్తృత కుట్ర గురించి సిబిఐ దర్యాప్తు చేయదా!

Saturday, December 21, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ జరుపుతున్న విచారణలో ఎలాంటి పురోగతి ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించింది.

స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడింది. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. హత్యలో ఉన్న విస్తృత కుట్రను బయటకు తీయాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.

 కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ విచారణ అధికారిని మార్చాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గతంలో ఆశ్రయించిన సమయంలో తులశమ్మ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో తాజాగా మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

శివశంకర్ రెడ్డి భార్య పిటిషన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను న్యాయ స్థానం ముందు ఉంచాలని సుప్రీం కోర్టు సిబిఐను ఆదేశించింది. కేసు దర్యాప్తును పరిశీలించిన న్యాయస్థానం రాజకీయ వైరంతోనే హత్య జరిగినట్లు పేర్కొనడంపై అసహనం వ్యక్తం చేసింది.

కేసు అంతా  రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు. హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణాధికారిని మార్చాలని, లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని తెలిపింది.

కేసు దర్యాప్తు వివరాల్లో ఎక్కడ చూసినా రాజకీయాల కారణాలను ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం, విచారణ ప్రక్రియ సజావుగా సాగడం లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.

దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారని సీబీఐని న్యాయమూర్తి  ప్రశ్నించారు. స్టేటస్ రిపోర్టులో చెప్పిందే చెప్తున్నారని పేర్కొంటూ ఇది సరైన పద్ధతి కాదన్నారు. కేసుకు ఒక ముగింపు ఉండాలని, ఇందులో విస్తృత కుట్ర ఉందని హైకోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఈ కేసులో బెయిలిచ్చే ప్రసక్తి కూడా లేదన్నారు.

కేసు మెరిట్స్ గురించి మాట్లాడదలచుకోలేదని చెబుతూ 2021 నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్ట్‌ చేయకుండా ఉత్తర్వులివ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు గత వారం తోసిపుచ్చింది. సిబిఐ విచారణలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles