వివేకా లేఖ వేలి ముద్రలు గుర్తించే పనిలో సీబీఐ!

Saturday, September 7, 2024

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన ఆధారంగా భావిస్తున్న, ఆయన చనివాపోవడానికి ముందు వ్రాసిన్నట్లు చెబుతున్న లేఖ నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో  సిబిఐ ఆధారాల సేకరణలో కీలకం కానుంది.

అందుకు నిందితులు వ్యతిరేకిస్తున్నా సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ పరీక్ష వల్ల ఏం జరగనుందన్న ఆసక్తి మొదలైంది. ఈ పరీక్ష్ ద్వారా లేఖరాయించిన వ్యక్తుల వేలిముద్రలు బయటపడుతాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నిన్‌హైడ్రిన్‌ టెస్ట్‌ పై పడింది.

నిన్‌హైడ్రిన్ పరీక్ష కోసం ఈ లేఖను దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ కు పంపించేందుకు కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.  ఒరిజినల్‌ లేఖను కోర్టుకు సమర్పించి, సర్టిఫైడ్‌ కాపీలను తీసి పెట్టుకోవాలని కోర్టు సీబీఐకి సూచించింది. నిన్‌ హైడ్రిన్‌ పరీక్షలో ఒక వేళ ఒరిజినల్‌ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్‌ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని తెలిపింది.

డ్రైవర్‌ ప్రసాద్‌ తనను హత్య చేసినట్టు వివేకా హత్యా జరిగిన స్థలంలో ఈ లేఖ లభించింది.  లేఖను 2021లో సీబీఐ కడప కోర్టు ద్వారా తీసుకుంది. వివేకా లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపించి, లేఖ వివేకా రాసిందేనా? ఒత్తిడిలో రాశారా? అని విశ్లేషించాలని నివేదిక ఇవ్వాలని కోరింది.

దానిపై నిన్‌హైడ్రిన్‌ ప్రయోగం చేస్తే అది దెబ్బతినే అవకాశం ఉంది. రసాయనిక ప్రయోగం త ర్వాత ఆ లేఖను కనీసం 80 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతల వద్ద వేడిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ పేపర్‌ పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే వివేకాతో బలవంతంగా లేఖరాయించిన వ్యక్తుల వేలిముద్రలు బయటపడుతాయి.
 కీలక పరీక్ష కావటంతో దీనివల్ల నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని కారణంగా ఈ అంశాన్ని సీబీఐ కోర్టు ముందుంచి అనుమతి కోరగా, అనుమతి లభించింది. నిన్‌హైడ్రిన్‌ అనేది ఒక రసాయనిక పౌడర్‌. దాని ఫార్ములా సీ9, హెచ్‌6, వో4. దీన్ని ఇథనాల్‌లో వేసినప్పుడు కరిగిపోతుంది.

నిన్‌హ్రైడిన్‌ పౌడర్‌ను రసాయనిక ద్రావణంగా మార్చి వివేకా రాసిన లేఖపై స్ర్పే చేస్తారు. లేదా ఆ రసాయనంలో లేఖను ముంచి బయటకు తీస్తారు. ఆ తర్వాత 80 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో దాన్ని వేడిచేస్తారు. దాన్ని బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు తీసుకొస్తారు. పది నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలి ముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం నీలం ఉదారంగులోకి మారుతుంది.

వివేకా రాసిన ఇతర పత్రాలతో పోల్చిన సీఎఫ్ఎస్‌ఎల్‌ అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు తేల్చి సీబీఐకి నివేదిక ఇచ్చింది. అయితే ఆ లేఖను బలవంతంగా రాయించినట్టు దస్తగిరి తెలపడంతో, లేఖపై వేలిముద్రలు గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ మరోసారి కోరింది.

వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్‌ నిపుణులు సీబీఐ అధికారులకు తెలియజేశారు. అయితే నిన్‌ హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంక్ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో లేఖ కీలక ఆధారంగా ఉండడంతో సీబీఐ కోర్టును ఆశ్రయించింది.

కాగా, సీబీఐ వాదనలను నిందితుల తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు.  ఆ పిటిషన్ చట్టసమ్మతం కాదని వాదించారు. అయితే లేఖ నిన్ హైడ్రిన్ టెస్ట్ కు అనుమతిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.  అత్యంత నిపుణులు చేసే ఈ టెస్టు ద్వారా లేఖపై ఉన్న వేలి ముద్రలు, ఇతర గుర్తులన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఈ టెస్టు కీలకంగా మారింది.

నాలుగేళ్ల తర్వాత చేపట్టనున్న నిన్‌హైడ్రిన్‌ టెస్ట్‌లో అసలు హంతకులకు బదులు ఇతరుల వేలిముద్రలు వెలుగుచూసే అవకాశం ఉందా? సాధ్యం అవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేఖ రాయించిన వారి వేలిముద్రలు దొరికే అవకాశం ఉంటుందని విచారణ అధికారులు స్పష్టం చేస్తుండడంతో  నిన్ హైడ్రిన్ పరీక్ష ఈ కేసులో కీలకమైన మార్పుగా పరిణమించే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles