వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ బహుముఖ దర్యాప్తు

Sunday, November 17, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబిఐ బహుముఖ దర్యాప్తుతో ఒక విధంగా మొత్తం ఘటనకు సంబంధించి పకడ్బందీ సమాచారం సేకరణలో నిమగ్నమైన్నట్లు కనిపిస్తున్నది. కొద్దీ రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశంతో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన కొత్త బృందం కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

సిబిఐ అడుగులతో ఒక విధంగా గందరగోళంగా ఉన్న అవినాష్‌ రెడ్డి బృందం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ బుధవారం విచారణకు వచ్చినా, తమ వాదనలు వినిపించడానికి మరోరోజు సమయం కావలనడంతో గురువారానికి వాయిదా పడింది. దానితో ప్రతి అంశాన్ని సిబిఐ లోతుగా విశ్లేషిస్తోంది.

నిందితుల కోణంలో కూడా విచారణలో భాగంగానే వివేకా అల్లుడు రాజశేఖర్‌ను మరోమారు ప్రశ్నించారు. ఈ సారి అల్లుడుతోపాటు వివేకా కుమార్తె సునీత కూడా సీబిఐ విచారణకు వచ్చారు. ఇప్పటికే రాజశేఖర్‌ను గత శనివారం అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి రావాలని చెప్పడంతో సీబిఐ ఆదేశాలతో భార్య సునీతతో మంగళవారం కలిసి సాయంత్రం కార్యాలయానికి వచ్చారు.

దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరిని విచారించిన అధికారులు వివేకా హత్య తర్వాత పరిణామాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో ఘటన స్ధలంలో లభించిన లేఖ కీలకమని, దాని గురించి అల్లుడు రాజశేఖర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ అవినాష్‌ రెడ్డి మొదటి నుంచీ డిమాండు చేస్తున్నాడు.

దీంతో రాజశేఖర్‌ దంపతులను మరలా లేఖ గురించి వివరాలు అడిగిన అధికారులు లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా రెండో వివాహం, కుటుంబ విభేదాలు, హత్యకు సంబంధించిన సమాచారం ఎలా తెలిసింది తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వీరిద్దరి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో వీరిద్దరినీ ఓ బృందం ప్రశ్నిస్తుంటే , మరో బృందం తెలంగాణా హైకోర్టులో అవినాష్‌ ముందస్తు బెయిల్‌ విచారణకు హాజరైంది. అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణపై కూడా అధికార బృందం దృష్టి పెట్టింది.

అంతేకాకుండా కేసులో కీలకమైన అప్రూవర్‌ దస్తగిరి భద్రతకు సంబంధించి అనుమానాలు రెకేత్తుతున్న నేపధ్యంలో ఓ బృందం పులివెందులలోని అతని ఇంటికెళ్ళింది. కేసు కీలక దశకు చేరుకుంటున్న క్రమంలో అవినాష్‌ బెయిల్‌పై ఉత్తరువులు రానున్న నేపధ్యంలో దస్తగిరి రక్షణ ప్రశ్నార్ధకమైంది.

అవినాష్‌, జగన్‌తో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో భద్రత పెంచారు. ఈక్రమంలో వివరాలు తెలుసుకున్న సీబిఐ ఏదైనా సమస్య వచ్చినా, కొద్దిపాటి అనుమానం కలిగినా వెంటనే తెలియజేయాలని దస్తగిరికి సూచించారు.

ఈ కేసు విచారణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే ఎంపీ అవినాష్‌ రెడ్డి పులివెందుల చేరుకున్న క్రమంలో అటువైపూ ఓ కన్నేసిన సీబీఐ తమ నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది.  దీనిలో భాగంగా అక్కడే మరికొంత మంది అధికారులు మకాం వేసి అక్కడి పరిస్ధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

దీంతో అవినాష్‌ను అరెస్టు చేయవచ్చనే ప్రచారం ఉూపందుకోవడంతో అక్కడి రాజకీయ పరిస్ధితులు, తాజా స్ధితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. మరోవైపు ఈ కేసులో తొలుత నుంచీ విచారించిన సాక్షులను మరలా పిలుపించుకుని తాజా పరిస్ధితులు, సమాచారానికి అనుగుణంగా విచారణ చేపట్టింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles