వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా షర్మిల

Friday, November 15, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాక్షిగా చేర్చింది. ఈ కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు విచారణ సంస్థ నుంచి వాంగ్మూలాన్ని స్వీకరించింది. 

గత ఏడాది అక్టోబర్ 7న ఢిల్లీలో సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలంలో దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలు ఉన్నాయి. తన వద్ద ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని, అయితే రాజకీయ కారణాలతో హత్యకు పాల్పడ్డారని వైఎస్ షర్మిల తన ప్రకటనలో పేర్కొనటం కలకలం రేపుతోంది. 

హత్య వెనుక కుటుంబ లేదా ఆర్థిక అంశాల ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేసింది. అయితే, ఎంపీ సీటు అంశం వివాదానికి దారితీసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.  ‘‘నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగింది.. ఈ హత్యకు కుటుంబం ఆర్థిక అంశాలు కారణం కాదు.. పెద్ద కారణమే ఉంది.. అవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండడమే హత్యకి కారణం కావచ్చు.. వారి దారికి వివేకా అడ్డొస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చు” అంటూ ఆమె పరోక్షంగా హత్యకు కారకులు ఎవ్వరో చెప్పినట్లయింది.

కుటుంబంలో సామరస్యం కనిపించినప్పటికీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి రాజకీయాల విషయంలో ప్రచ్ఛన్నయుద్ధం ఆ సమయంలో నడుస్తోందని ఆమె వెల్లడించడం గమనార్హం. కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటికి కనిపించిన లోపల కోల్డ్ వార్ నడిచేదని షర్మిల సీబీఐకు వాంగ్మూలమిచ్చారు.

“హత్యకు కొన్ని నెలలు ముందే వివేకా బెంగళూరులో మా ఇంటికి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని మా చిన్నాన్న వివేకా నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయవద్దని వివేకా కోరుకున్నారు. అవినాష్‌కు ఎంపీ టికెట్ రాకుండా జగన్ మోహన్ రెడ్డిని ఒప్పిద్దామని నాతో చెప్పారు” అంటూ ఆమె వివరించారు. 

పైగా, పరిస్థితుల్లో జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్ళనని తనతో చిన్నాన్న చెప్పారని పేర్కొంటూ ఈ విషయంలో జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలనని వివేక తనతో చర్చించారని షర్మిల తెలిపారు. తనపై బాబాయ్ పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో ఏమి చేయలేక సరే అన్నట్టు సీబీఐ ముందు చెప్పారు.

ఎంపీగా వివేక పోటీ చేయాలని భావించకుండా మీపై ఎందుకు ఒత్తిడి తీసుకువచ్చారని సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా  అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓడిపోవడంతో ఎంపీగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు షర్మిల చెప్పారు. తల్లి విజయలక్ష్మిపై వివేక పోటీ చేసిన తర్వాత కొంత దూరంగా ఉన్నారని చెప్పారు. ఆ కారణంతోనే తనకు టికెట్ దొరకపోవచ్చుని వివేక భావించి ఉండవచ్చునని షర్మిల పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వివేక ఓటమికి దగ్గరగా ఉన్న వ్యక్తులే కారణమని తాను స్పష్టంగా చెప్పగలనని ఆమె తేల్చి చెప్పారు.

మరోవంక, వివేకానందరెడ్డి హత్యకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది.  సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది.

వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని తెలిపింది.  వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. విచార‌ణ ప‌లు ద‌శ‌ల‌లో కొన‌సాగుతున్న‌ద‌ని వివ‌రించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles