స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకునే అవకాశమే ఉంది. పైగా కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీల మద్దతున్న వారిని కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా వైసీపీ అనుచితమైన మార్గాల్లో కొన్ని ఏకగ్రీవం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల సంగతి ఇంకో ఎత్తు. అనుచిత మార్గాలను నమ్ముకుని మాత్రమే.. వైసీపీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మోహరిస్తోంది. ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడమే ఇందుకు ఉదాహరణ. దీని వెనుక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను కూడా క్లీన్ స్వీప్ చేసేద్దాం అనే కుట్రకోణం కనిపిస్తోంది. అయితే వారి అత్యుత్సాహానికి చంద్రబాబు నాయుడు బ్రేక్ వేయడానికి డిసైడ్ అయ్యారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధను పోటీచేయించాలని పార్టీ అనుకుంటున్నట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. తమ కేండిడేట్ ను బరిలోకి దించి, పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేయడం ద్వారా ఎడ్వాంటేజీ సాధించాలని, తమకు విజయం దక్కుతుందని తెలుగుదేశం ఆలోచిస్తోంది. విజయం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. పోటీలేకుండా సీట్లను దక్కించుకుని, తమకు ఎదురులేదని టముకు వేసుకుంటూ.. అధికార పార్టీ వైసీపీ విర్రవీగడానికి మాత్రం అవకాశం ఉండదు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలవాలంటే 22నుంచి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లుంటే చాలు. టీడీపీకి సభలో ఉన్న బలం 23. ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు దక్కడానికి ఆ బలం చాలు. అయితే ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీలో అధికారికంగా చేరకుండా, ఆ పార్టీలో పనిచేస్తున్నారు. అలాగే జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వైసీపీలోనే పనిచేస్తున్నారు. వైసీపీ ఫిరాయింపుల విషయంలో పైకి నీతులు ప్రవచిస్తుంది గానీ.. ఇప్పుడు వారందరి ఓట్లను నమ్ముకుని మాత్రమే.. ఏడుగురితో పార్టీ నామినేషన్లు వేయించింది.
ఇప్పుడు తెలుగుదేశం తరఫున అనురాధ నామినేషన్ వేస్తే.. వైసీపీకి ఇరకాటమే. ఆ పార్టీ విప్ కూడా జారీ చేయదలచుకున్నది గనుక.. లీగల్‌గా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ వారికే ఓటు వేయాల్సి వస్తుంది. వైసీపీకి వేయలేరు. అతి చేసి వైసీపీకి ఓటు వేస్తే.. టీడీపీ విప్ ఉంటుంది గనుక.. వారి ఎమ్మెల్యే పదవులకే ఎసరు వస్తుంది. మహా అయితే వారు గైర్హాజరు కాగలరు. అదే జరిగితే.. వైసీపీ తరఫున మొత్తం ఏడుగురూ గెలవడం కష్టమవుతుంది. ఇలా ఏరకంగా చూసినా ఆ పార్టీకి ఇబ్బంది తప్పదు. వాళ్లేదైనా తిమ్మిని బమ్మిని చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించుకున్నా.. విప్ ధిక్కరించినట్టు ఫిర్యాదులు వెళ్తాయి. వాళ్ల మీద చర్యలు తీసుకోకుంటే వైసీపీ పరువు పోతుంది. ఫిరాయింపుల విషయంలో నీతులు చెబుతుంది గానీ.. చేసేవన్నీ తప్పుడు పనులే అని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. అన్నీ క్లీన్ స్వీప్ చేయగలం అని విర్రవీగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు చంద్రబాబునాయుడు ఏదో ఒక రూపంలో బ్రేకులు వేయడం తథ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
విర్రవీగే వైసీపీకి చంద్రబాబు బ్రేకులేస్తారా?
Saturday, November 16, 2024