ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భేటీ కావడం, గత నెలలో ఏపీ పర్యటన సందర్భంగా అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం జగన్ ది అంటూ విమర్శలు గుప్పించడంతో మోదీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అనుబంధాన్ని త్రుంచి వేసుకొని, చంద్రబాబుకు దగ్గర అవుతున్నట్లు కధనాలు వస్తున్నాయి.
అయితే, వచ్చే ఎన్నికలలో ఏదేమైనా తిరిగి వైఎస్ జగన్ గెలుపొందేందుకు అండగా ఉండాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వ పరంగా అందిస్తూ, రాజకీయంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా మైనారిటీలు, దళితులలో జగన్ ఓట్ బ్యాంకుకు రక్షణ కల్పించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
పైగా, ఎన్నికల సమయంలో జగన్ కు ప్రజలలో పెద్ద బూస్ట్ ఇవ్వడం కోసం తొమ్మిదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన హామీలకు సంబంధించిన కీలక అంశాలను అమలు చేసేందుకు కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై కేంద్ర పెద్దలతో సమాలోచనలు జరిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీలలో ఢిల్లీ వీడుతున్నట్లు చెబుతున్నారు.
విభజన సమయంలో చెల్లించ వలసిన రెవిన్యూ లోటుకు సంబంధించి సుమారు రూ 10,000 కోట్లను ఈ మధ్యనే చెల్లించింది. పైగా, గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడువుగా కేంద్రం, రిజర్వు బ్యాంకు రుణ పరిమితిని పెంచుకుంటూ వస్తున్నది. ఆ విధంగా ఎన్నికల సంవత్సరంలో సంక్షేమ పధకాల అమలుకు జగన్ కు నిధుల కొరత ఏర్పడకుండా ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తినడం, తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో దక్షిణాదిన కేంద్రంకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న ప్రభుత్వం వై ఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే కావడంతో, ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం తమకు అత్యవసరమని బిజెపి అగ్రనాయకులు భావిస్తున్నారు.
పైగా, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లుల విషయంలో రాజ్యసభలో వైసీపీ సభ్యుల మద్దతు బిజెపికి కీలకం కానుంది. ప్రజా వ్యతిరేకతతో జగన్ ప్రభుత్వం కూలిపోయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తమను దాటి పోకుండా ఉండేందుకు సామరస్య సంబంధాలు కొనసాగిస్తున్నా ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలని బీజేపీ మాత్రం కోరుకోవడం లేదు.
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కు పూర్తిగా మద్దతు ఇచ్చిన మైనారిటీల ధోరణిలో కొంతకాలంగా కొంత మార్పు కనిపిస్తుంది. వారిలో కొందరు టీడీపీ వైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా, ప్రధాని మోదీ కనుసన్నలలో జగన్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం మైనారిటీల్లో వైసీపీ పట్ల అనుమానాలు కలిగిస్తున్నది. అందుకనే రాజకీయంగా జగన్ ప్రభుత్వంపై కేంద్ర నాయకులు విమర్శలు గుప్పించడం ద్వారా పరోక్షంగా జగన్ ను బలోపేతం చేసేందుకు బీజేపీ పెద్దలు సహకరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.