తాము రాజ్యాంగవిరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అనే సంగతి అధికార యంత్రాంగానికి బాగా తెలుసు.. కానీ తాము ఎలా పనిచేయాలో వారికి ఉన్న గైడ్ లైన్స్ బహుశా అంతే కావొచ్చు.ప్రతిపక్షాలు ఎలాంటి విన్నపాలతో వచ్చినా సరే.. ప్రభుత్వాధికారులు వాటిని తిప్పికొడతారు. ఎటూ తిప్పికొడతారని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ఆ వెంటనే వారు హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టు అనుమతులు ఇస్తుంది. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మొక్కుబడి సహకారం, సహాయ నిరాకరణ వంటి చిన్నెల సాక్షిగా వారి కార్యకలాపాలు అనుకున్నట్టుగా సాగిపోతాయి. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ప్రతిపక్షాలు ఎలాంటి యాక్టివిటీ చేయాలనుకున్నా సరే.. అందుకు సంబంధించిన అనుమతుల్ని ‘‘వయా హైకోర్టు’’ తెచ్చుకోవాల్సి వస్తోంది.
తెలుగుదేశం జనసేన పార్టీలు, వారి నాయకులు సభలు పెడతాం అంటేనో, రోడ్ షోలు చేస్తాం అంటేనో ప్రభుత్వం జంకితే, భయపడితే అర్థముంది. వారు ప్రజల ముందుకు వెళ్లడం అంటూ జరిగితే ప్రభుత్వాన్ని తిట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. మరొక అంశం ఉండదని, తమ పరువు పోతుందని భయపడి వారికి అనుమతులు ఇవ్వకపోతే అర్థముంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ తో, విభజన హామీలను అమలుచేయాలని కోరుతూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు బస్సు యాత్ర చేయాలని అనుకుంటే.. అందుకు కూడా ప్రభుత్వం ఉలికి పడుతోంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
ఏఐవైఎఫ్ తలపెట్టిన ఈ బస్సుయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు కూడా కోర్టును ఆశ్రయించారు. ప్రశాంతంగా చేయదలచుకుంటున్న బస్సుయాత్రకు అనుమతులు ఇవ్వాల్సిందేనని, నాలుగురోజుల్లో నిర్ణయం తీసుకుని తమకు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి చిన్న ఉద్యమం, పోరాటం విషయంలో ఎందుకిలా జరుగుతోంది. ప్రతిదానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, తర్వాత కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత.. అనుమతులుఇస్తూ ఉంటే ప్రభుత్వం పరువు పోతుందనే భయం వారికి కలగడం లేదా? అనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాల నేపథ్యంలోనే సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ సీపీఐ రామకృష్ణ గట్టిగా అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా పేరుతో ఎన్ని పోరాటాలు చేసిందో వారు మర్చిపోతే ఎలా? అప్పుడు అనుమతులు రాకుండా ఉంటే ఏం చేసేవారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రతి పోరాటానికీ నో చెప్తారా? అనేది ప్రజల ప్రశ్న. ప్రత్యేకహోదా రాకపోవడం అనేది రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కంటె, కేంద్రం చేసిన వంచనగానే ఎక్కువమంది గుర్తిస్తారు. మరి అలాంటప్పుడు హోదా కోసం పోరాటం అంటే, కేంద్రంపై పోరాటమే. దానిని కూడా అడ్డుకోడానికి రాష్ట్ర సర్కారు అనుమతులు తిరస్కరించడం, కోర్టు చెప్పిన తర్వాత మెట్టు దిగిరావడం చూస్తోంటే.. ప్రతి పోరాటానికీ వయా హైకోర్టు మాత్రమే దారి ఉన్నట్టుగా కనిపిస్తోంది.
విపక్ష పోరాటాలు.. వయా హైకోర్ట్ ఓన్లీ!
Wednesday, January 22, 2025