విపక్ష కూటమికి బీటలు పడుతున్నదా?

Sunday, December 22, 2024

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఆవేశ పడిపోయి ప్రసంగించడం అనేది.. జాతీయ స్థాయిలో ఏర్పాటు అవుతున్న విపక్ష కూటమి ప్రయత్నాలకు బీటలు వేస్తున్నదా? ఐక్యతకు భంగం వాటిల్లకపోయినప్పటికీ.. కాంగ్రెస్ సారథ్యానికి గండి కొట్టే అవకాశం ఉన్నదా? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ నివాసంలో, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశం అయి మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించిన నేపథ్యంలో దీని మర్మం ఏమై ఉంటుందనే చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి.
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. యధావిధిగా భారాసను, బిజెపి బి టీమ్ అని అభివర్ణించారు. అందువల్లనే విపక్ష కూటమికి వారిని దూరం పెట్టినట్టు కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ ను పిలిస్తే కార్యక్రమానికి తాము రామని చెప్పినట్టు వెల్లడించారు. అంటే కాంగ్రెస్, భారాసను తీవ్రంగా ద్వేషిస్తున్నదనే సంగతి అర్థమవుతూనే ఉంది.
అయితే ఇప్పటికే విపక్ష కూటమిలో చిన్న లుకలుకలు ఉన్నాయి. ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును కాంగ్రెస్ కూడా స్పష్టంగా వ్యతిరేకించక పోతే.. కూటమిలో కొనసాగం అని ఆప్ అంటోంది.ఈ విషయంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు. బెంగుళూరు భేటీకి ఆప్ హాజరవుతుందో లేదో కూడా డౌటే. ఇలాంటప్పుడు అఖిలేష్ కేసీఆర్ ను కలవడం కీలకంగా ఉంది.
విపక్ష కూటమిలో కాంగ్రెస్ ఉండడానికి వీల్లేదని, ముందు వారిని బయటకు గెంటేయాలనే డిమాండ్ ను అఖిలేష్ ద్వారా కేసీఆర్ తెరపైకి తెస్తారా? అనే పలువురు అంచనా వేస్తున్నారు. భారాస గురించి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కేసీఆర్ ఈ వ్యూహం చేయవచ్చునని అనుకుంటున్నారు. కాంగ్రెస్ లేకపోతే గనుక.. ఆ కూటమిలో భారాస కూడా ఉంటుందనే ప్రతిపాదనను అఖిలేష్ ద్వారా ముందుకు తీసుకువెళ్తారు.
లేదా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోకి భారాసను కూడా ఆహ్వానించడానికే అఖిలేష్ వచ్చారా? ఆమేరకు కాంగ్రెస్ ను ఆయన ఒప్పించదలచుకున్నారా? అనే అంచనాలు కూడా ఉన్నాయి. అలా జరిగితే అది భారాసకు ఆత్మహత్యా సదృశం అవుతుంది.
అయితే భేటీ తరువాత ఇరువురు నాయకులూ ప్రెస్ మీట్ పెట్టి ఏ సంగతీ ప్రకటించకపోవడం వల్ల ప్రజల్లో రకరకాల అనుమానాలు పుడుతున్నాయి. మరి వీటిపై కేసీఆర్ ఎప్పటికి స్పష్టత ఇస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles