ఒక ఏడాది క్రితం వరకు వైసిపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత కీలక నాయకుడిగా ఎదిగిన పార్లమెంట్ లో వైసిపి పక్ష నాయకుడు విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా కనిపించడం లేదు. చాలావరకు ఢిల్లీకే పరిమితం అవుతున్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో జగన్ తర్వాత కీలక అధికార కేంద్రంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ప్రాధాన్యం గత సంవత్సర కాలంగా తగ్గుతూ వస్తున్నది.
ఒక విధంగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అటువంటి అధికారం చెలాయిస్తున్నారు. వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న అన్ని సిబిఐ, ఈడీ కేసులలో జగన్ మొదటి నిందితుడు కాగా, విజయసాయిరెడ్డి రెండో నిందితుడు. వారిద్దరూ కలిసే జైలులో ఉన్నారు. ఒక విధంగా జగన్ ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించిన అన్ని ఆర్ధిక లావాదేవీలకు వ్యూహరచన చేసినది అంతా విజయసాయిరెడ్డి అని అంటుంటారు.
అంతటి లోతయిన జగన్ – విజయసాయి బంధం ఇప్పుడెందుకు బీటలు వారుతుందో చాలామందికి అర్థం కావడం లేదు. సాయిరెడ్డిని ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కూడా ఆయన స్థానంలో మరో రాజ్యసభ సభ్యుడికి ఢిల్లీ వ్యవహారాలు అప్పచెప్పే ప్రయత్నం చేసినా, ఫలించకపోవడంతో ఆయనపై ఆధారపడి ఉండక తప్పడం లేదు.
సాయిరెడ్డికి పిఎంఓతో సహా విస్తృతంగా ఉన్న పరిచయాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం, క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేలా చేయడం, పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు ఢిల్లీ స్థాయిలో పరిష్కారాలు చూడటం, ఎన్నికల నాటికి నాయకుల్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.
విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పరిమితం చేయడానికి రకరకాల కారణాలు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ, ఆమెకు నమ్మకస్తులకు పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పచెప్పుతున్నట్లు భావిస్తున్నారు.
వైసిపి సోషల్ మీడియా అంత ఇదివరకు విజయసాయిరెడ్డి కనుసన్నలలో జరుగుతూ ఉండెడిది. కానీ ఇప్పుడు సజ్జల కుమారుడి పర్యవేక్షణలో సాగుతుంది. అప్పటి నుండి గతంలో మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులను కించపరుస్తూ ట్వీట్లు చేయడం విజయసాయిరెడ్డి మానుకొన్నట్లు స్పష్టం అవుతుంది.
ఈ పరిణామాలకు తోడు గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వంలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార వేత్తల ప్రమేయం కూడా ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డితో పాటుగా విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కీలక పాత్ర వహించడం, పైగా అందుకు సంబంధించిన వివరాలు ముందుగా తనకు తెలియక పోవడంతో జగన్ అసహనంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వ్యూహాత్మకంగా జగన్ కేంద్రంలోని బిజెపి పెద్దల కనుసన్నలలో నడుచుకొంటుండగా, అక్కడ బిజెపిని సవాల్ చేస్తున్న ఆప్ నేతలతో చేతులు కలిపి, పెద్ద ఎత్తున ఆప్ కు నిధులు సమకూర్చే పని చేయడం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీటన్నింటికి మించి నందమూరి తారకరత్న మృతి వ్యవహారంలో అతని భార్య తనకు వరుసకు కుమార్తె కావడంతో విజయసాయిరెడ్డి బాసటగా నిలబడటం, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబునాయుడులతో కలసి అంతా తామే అన్నట్లు వ్యవహరించడం జగన్ కు మరింత ఆగ్రహం కలిగించినట్లు అప్పట్లోనే కధనాలు వెలువడ్డాయి. దీనిని సాకుగా తీసుకొని టిడిపిపై దాడి చేయాలనే పార్టీ ఎత్తుగడ విజయసాయిరెడ్డి అక్కడ ఉండడంతో సాగకపోవడం సహజంగానే అసహనం కలిగిస్తుంది.