పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తుండగా ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను దగ్గరకు చేరుకునేందుకు బిఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులందరిని ఏకతాటిపైకి తీసుకురావటం ఉద్దేశ్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు.. అంతర్గత కుమ్ములాటలకు వేదికలవుతున్నాయి.
రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25 లోపు ఆత్మీయ సమావేశాలు పూర్తి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడానికి సమన్వయకర్తలుగా జిల్లా ఇంఛార్జులను కూడా నియమించారు.
పార్టీలో తమను పట్టించుకోని నేతలను ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా నిలదీస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన అంసతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలవట్లేదంటూ సొంత నేతలపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపునకు (రాజయ్య) కృషిచేశానని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని అన్నారు. అయినా తనను పార్టీ సమావేశాలకు పిలువకుండా పక్కన పెడుతున్నారని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అందర్నీ కలుపుకొనిపోవాలని, లేకపోతే. పార్టీలో విభేదాలు వస్తాయని ఎమ్మెల్యే తాటికొండ ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి హెచ్చరించారు.
ఆత్మీయ సమ్మేళనాలు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్‌లోనూ అగ్గి రాజేశాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై స్థానిక నేతలు అసమ్మతిని వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి కార్యకర్తలను వాడుకొని వదిలేస్తారని, స్థానిక బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు బహిరంగ లేఖ రాశారు. తమను ఆత్మీయ సమ్మేళనాలకు పిలవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు రాబోయే కాలంలో సత్తా చాటుతారని అంటూ పార్టీలో కలకలం రేపారు.
ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని హెచ్చరించారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందని చెప్పారు.