ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చే ఎన్నికలలో కీలకం కాగలదని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారానే సంక్షేమ కార్యక్రమాల అమలు జరుపుతూ ఉండడంతో, వారే వచ్చే ఎన్నికల్లో అధికార పక్ష అభ్యర్థులకు ఓట్లు కూడా తీసుకు వస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
అందుకై తమకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గమనించిన వాలంటీర్లు ఇతర వైసిపి నేతలను, ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా గ్రామాలలో తమకు తిరుగు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై అధికార పార్టీ నేతలలోనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.60 లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరినే వైఎస్ జగన్ `ఎన్నికల సైన్యం’గా పరిగణిస్తున్నారు. అయితే వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థనే టార్గెట్ చేస్తూ, నిశితంగా విమర్శలు కురిపిస్తుండడంతో సహజంగానే అధికార పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు.
అయితే, ఈ సందర్భంగా తగిన `హోమ్ వర్క్’ చేయకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేయకుండా వారిపై ఉమెన్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత మాట మార్చి వాలంటీర్ వ్యవస్థ పైన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఒక విధంగా ఈ విషయంలో పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు.
పవన్ చేసిన ఆరోపణల పైన వాలంటీర్లు మండిపడ్డారు. నిరసనలకు దిగారు. వైసీపీ నేతలు సైతం వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. మిత్రపక్షం అనుకొంటున్న బీజేపీ ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. గతంలో పలు సందర్భాలలో అండగా ముందుకొచ్చి అధికార పార్టీ దాడులను తిప్పికొట్టిన టిడిపి సహితం వలంటీర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది.
కేవలం ఈ వ్యవస్థపై రాజకీయ విమర్శలకు మాత్రమే టీడీపీ నేతలు పరిమితం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా మొత్తం వలంటీర్లపై దాడులకు దిగడం లేదు. తాము అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం సమర్థవంతంగా, సక్రమంగా పని చేసేలా వలంటీర్లను తీర్చిదిద్దుతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు వెల్లడించారు. వేధింపులు, పని ఒత్తిడి లేకుండా ప్రజలకు జవాబు దారీగా, బాధ్యతాయుతంగా సేవలందించే నూతన వ్యవస్థగా మారుస్తామని పేర్కొనడం ద్వారా వలంటీర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.
ఆ వాలంటీర్, సచివాలయ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందనడం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పడం ద్వారా వారిని కూడా తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను, కొందరు వాలంటీర్ల హద్దులు మీరిన ప్రవర్తననే తాము తప్పు పడుతున్నామని వివరణ ఇచ్చారు.
వాలంటీర్లను తమ స్వార్థానికి వాడుకుంటున్న ప్రభుత్వాన్ని, వైసీపీ నేతల్ని నిలదీస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక వైపు పవన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వస్తున్నా వాలంటీర్ల విషయంలో తాను వ్యతిరేకమనే సందేశం ఇస్తున్న సమయంలో టిడిపి ఈ విధంగా సానుకూల ధోరణి ప్రదర్శించడం జనసేన అధినేతకు షాక్ ఇచ్చిన్నట్లయింది.
అసలు పంచాయితీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకని ప్రశ్నించడం ద్వారా ఈ వ్యవస్థ అవసరం లేదన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ప్రజల డేటా సేకరించటం ఏంటని నిలదీశారు. అయితే, పవన్ కళ్యాణ్ మాదిరిగా ముందు- వెనుక చూసుకోకుండా, రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చిన్నట్లు విమర్శలు చేసేందుకు టీడీపీ వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పెద్ద సంఖ్యలో ఉన్న వాలంటీర్లను ఎన్నికల వేళ దూరం చేసుకోకూడదని టిడిపి వ్యూహాత్మకంగా ఓ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడవుతుంది. పవన్ వ్యాఖ్యలతో వెల్లువెత్తిన నిరసనతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ తో పొత్తు వేళ కీలక అంశంలో టీడీపీ చేసిన ఈ ప్రకటన పైన జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.