వాలంటీర్ల నిజస్వరూపం ఏమిటో.. వారి నుంచి వాస్తవంగా ప్రభుత్వం ఆశిస్తున్నది ఏమిటో.. వారికి ముట్ట చెప్పే వేతనానికి వారికి అప్పజెప్పిన బాధ్యతలు ఏమిటో.. ఎలాంటి ముసుగు లేకుండా స్పష్టంగా బయటకు వచ్చాయి. గ్రామ వాలంటీర్లు, ఓటర్లు అందరినీ కలిసి వారి వారి వ్యక్తిగత వివరాలను సేకరించి ఇష్టాయిష్టాలను తెలుసుకొని ఏ పార్టీకి చెందినవారనే వివరాలను కూడా నమోదు చేసి, పార్టీ నాయకులకు జాబితాలు అందించాలని సాక్షాత్తు సీనియర్ మంత్రి గారు వారికి కర్తవ్యోపదేశం చేశారు.
ఇలాంటి బాధ్యతలను తెలియజెప్పిన సదరు మంత్రిగారు ఆషామాషి వ్యక్తి కాదు. చాలా సీనియర్ మంత్రి. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవశీలి. ఆ మంత్రి పేరే ధర్మాన ప్రసాదరావు. ఆయన నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకులు, వాలంటీర్లు, గృహసారథులతో కలిసి ఓ సమావేశం నిర్వహించి అసలు సీక్రెట్స్ అన్నీ అక్కడ మాట్లాడారు. ‘‘మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి సహకరించాల్సిన అవసరం ఏర్పడింది. మీరంతా సహకరిస్తే తిరిగి అధికారంలోకి వస్తాం. ఆ తర్వాత మీకు తగిన ప్రతిఫలం అందేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు. మీరు చేయాల్సిన పనేంటంటే.. ఆరు నెలల్లోగా ఇంటింటికీ వెళ్ళండి.. ఆయా కుటుంబ సభ్యుల మనోభావాలు తెలుసుకోండి.. మనకు ఓటేసే వారేనా ప్రతిపక్షాలకు చెందినవారా అనేది గమనించి జాబితా తయారు చేయండి.. ఆ జాబితాలను పార్టీ నాయకులకు ఇస్తే, మేము వాటిని పైవాళ్లకు పంపుతాం! వారు మిగిలిన చేయవలసిన పనినంతా చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని మీ పనితీరు మీద పార్టీ నాయకులు, గృహసారథులు నిఘా ఉంచుతారు’’ అని ధర్మాన ప్రసాదరావు పురమాయించారు.
అచ్చంగా ప్రతిపక్షానికి ఓట్లు వేసే ప్రజలను ఏరి, వీలైతే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, లేదా ప్రలోభ పెట్టి భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహరచన చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిందని, ఇన్నేళ్లుగా వారికి వేతనాలు కూడా ఇస్తున్నదని ధర్మాన మాటలను బట్టి అర్థమవుతోంది. కేవలం రాజకీయ పార్టీ అవసరాలు కోసం వాలంటీర్లను వాడుకుంటూ ప్రభుత్వ ఖజానా నుంచి వారికి వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్మాన ప్రసాదరావు ఎంత సీనియర్ అయినప్పటికీ నోరుజారి ఇలా ప్రభుత్వం యొక్క అసలు రహస్యాలను బయట పెట్టడం ఇది తొలిసారి కాదు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు, మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అని మాయమాటలతో ప్రజలను వంచించడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. ధర్మాన ప్రసాదరావు మాత్రం విశాఖలో మాట్లాడుతూ, మూడు రాజ్యాలు అంతా ట్రాష్ అని విశాఖ ఒకటే రాజధానిగా ఉంటుందని హైకోర్టు, అసెంబ్లీ ఉన్నంత మాత్రాన వాటికి ఏ విలువా ఉండదని తేల్చి చెప్పిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాజధాని విషయంలో ప్రభుత్వం చేసే మోసాన్ని బయటపెట్టిన తీరుగానే మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్ల విషయంలో అసలు రహస్యాన్ని ఇవాళ బయట పెట్టడం యాదృచ్ఛికం కావచ్చు. అధికార పార్టీ యొక్క దుర్మార్గమైన ఆలోచనా సరళి ఇప్పుడు సర్వత్రా విమర్శలకు గురవుతోంది.