ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ జిల్లాలో సాగిస్తున్న `వారాహి విజయ యాత్ర’లో అనూహ్యంగా వాలంటీర్లపై విరుచుకు పడుతుండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది.
మొదటి దశలో రాజకీయ అంశాలకే పరిమితమైన ఆయన, ఏలూరు నుండి ప్రారంభించిన రెండో దశ యాత్రలో మొదటి రోజుననే మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు చేసి పెను దుమారం రేపారు. ఈ విషయమై బహుశా మొదటిసారిగా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి పవన్ కళ్యాణ్ కు నిరసన తెలుపుతూ ఆందోళనలకు దిగారు.
పవన్ క్షమాపణలు చెప్పాలని కొరతమే కాకుండా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. పవన్ పై రాజకీయ విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు ర్యాలీలు జరపాలన్న పోలీసులు అడుగడుగునా అడ్డుకొంటున్న సమయంలో వాలంటీర్లకు మాత్రం అడ్డులేకుండా పోయింది.
మరోవంక, ఏపీ మహిళా కమీషన్ సీరియస్ అయింది. చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా వివరణ ఇవ్వాలని, ఆధారాలు తెలపాలని అంటూ పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేసి, అందుకు పది రోజుల వ్యవధి ఇచ్చారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు ముప్పేట మాటల దాడులకు దిగుతున్నారు.
అయినా, పవన్ వెనుకడుగు వేయడం లేదు. వలంటీర్ల ప్రవర్తనపై, అసాధారణ అధికారాలు చెలాయిస్తూ నిరంకుశంగా వ్యవహరితుండటంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళల అక్రమ రవాణాతో వారికి సంబంధం అంటగట్టడాన్ని ఎవ్వరూ హర్షింపక పోయినా గ్రామాలలో వలంటీర్ల అరాచకాల గురించి వ్యక్తిగత సంభాషణలలో వైసిపి నాయకులే వాపోతున్నారు.
వారు సర్పంచులు, మండల నాయకులనే కాకుండా ఎమ్యెల్యేలను కూడా ఖాతరు చేయకుండా, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై విమర్శలు గుప్పిస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు అన్ని దాదాపు మౌనం పాటిస్తున్నా గ్రామాలలో మాత్రం సానుకూల స్పందనలు వస్తున్నట్లు కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ యంత్రాంగాన్ని దాదాపు నిస్తేజం చేసేసారు. చివరకు ప్రజా ప్రతినిధులను కూడా పరిగణలోకి తీసుకోకుండా వలంటీర్ల వ్యవస్థపై ఆధార పడుతున్నారు. వచ్చే ఎన్నికలలో వారే అధికార పార్టీకి ఓట్లు తీసుకు వస్తారని ధీమాతో ఉన్నారు.
ప్రతి గ్రామం, మండలం, నియోజక వర్గంలో ప్రతి ఓటరు గురించిన పూర్తి సమాచారం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి చేరుతోంది. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారంతో పాటు వారు ఏ పార్టీకి అనుబంధంగా ఉంటున్నారో కూడా తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోడానికి వీలవుతుంది. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో జనాభాపై అవగాహన ఉంటుంది. కులాల వారీగా, మతాల వారీగా లెక్కలు తెలుస్తాయి.
టీడీపీ హయంలో జన్మభూమి కమిటీలు, సాధికార మిత్రల పేరుతో ఇదే తరహా ప్రయోగాలు చేసినా అది అంత పటిష్టంగా జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి, ప్రభుత్వానికి నడుమ వాలంటీర్ల రూపంలో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో వారి జోక్యం ఉండకూడదని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసినా గ్రామాలలో వారు చెప్పిందే వేదంగా మారుతుంది.
వారి ఆగడాలకు అడ్డు,, అదుపు లేకుండా పోతుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. అందుకనే వారిలో గందరగోళం రగిల్చి, ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ హిట్లర్ నిఘా వ్యవస్థలాగా మారుతోందని హెచ్చరించడం గమనార్హం.
మహిళల వ్యక్తిగత సమాచారాన్ని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణ చేయడం ద్వారా వారిలో భయాందోళన రేకిత్తించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత అనేది పక్కన పెడితే, మహిళలకు భద్రత లేదని ప్రచారం ఎక్కువగా తమకు లబ్ది కలిగిస్తుుందని జనసేన నాయకులు భావిస్తున్నారు. గతంలో మాదిరి ప్రజలు వాలంటీర్లకు సహకరించకుండా కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.