వాలంటీర్లపై కత్తి దూస్తున్న ధర్మాన!

Thursday, May 16, 2024

వాలంటీరు వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తుంటుంది. అయితే వ్యవస్థ రూపస్వభావాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుచాలా దారుణంగా తమస్వార్థానికి వాడుకుంటున్న మాట వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లను తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూలీలుగా, పాలేర్లుగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. వారిని అలాగే పరిగణిస్తున్నారు. తమ అడుగులకు మడుగులు ఒత్తినంత వరకే వారికి మనుగడ.. కొంచెం స్వతంత్రంగా పనిచేసినా సరే, తమ మాటకు ఎదురుచెప్పినా సరే.. ఆ వాలంటీర్ల మీద కక్ష కట్టి ఉద్యోగాలు పీకేయించేస్తున్నారు. తాజాగా మంత్రి ధర్మానప్రసాదరావు కూడా తన కార్యక్రమానికి హాజరు కాని వాలంటీర్లు అందరినీ ఉద్యోగాలనుంచి తొలగించాలంటూ.. ఆగ్రహించడం చర్చనీయాంశం అవుతోంది.
వాలంటీర్లు అంటే.. తమ బానిసలు అని పరిగణించేవారిలో ధర్మాన ప్రసాదరావు ముందు వరుసలో ఉంటారు. ఇంటింటికీ తిరిగి ఫ్యాను గుర్తుకుఓట్లు వేయించే బాధ్యత మీరే తీసుకోవాలని ఆయన పదేపదే వాలంటీర్ల సమావేశాల్లో చెబుతూ ఉంటారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, చంద్రబాబు గెలిస్తే మీ పెన్షన్లన్నీ రద్దవుతాయి.. అని ఇంటింటికీ తిరిగి చెప్పాలని ధర్మాన వారికి ఉపదేశిస్తుంటారు. ఎన్నికల దిశగా ఇక ప్రభుత్వం గానీ, పార్టీ గానీ చేయవలసిన పని మరేమీ ఉండదు.. కేవలం వాలంటీర్లు మాత్రమే ఇంటింటికీ తిరిగి ప్రజలందరితో ఫ్యాను గుర్తుకు ఓటు వేయించాలి.. అని నిర్దేశిస్తున్నట్టుగా ధర్మాన ధర్మోపదేశాలు సాగుతుంటాయి.
అలాంటి ధర్మాన శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో గుడివీధి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కొందరు వాలంటీర్లు ముందుగా సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారని గుర్తించారు. వాలంటీర్లు రాకపోవడం కరెక్టు కాదని.. అలాంటి వారిని వెంటనేతొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం అయితే.. వాలంటీరు వ్యవస్థ ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లలో ఒక రకమైన భయం విత్తనాలు నాటడానికి ప్రయత్నిస్తుంటారు. తమ ప్రభుత్వం వచ్చినా వాలటీరు వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు ఒకవైపు చెబుతున్నా వీరు భయాలు వ్యాపింపజేస్తుంటారు. కానీ తాజాగా ధర్మాన ఆగ్రహాన్ని గమనించినప్పుడు.. వాలటీర్ల ఉద్యోగాలు పోవడం అనేది చంద్రబాబు సీఎం అయితే కాదు.. ఈ వైసీపీ నాయకులకు ఊడిగం చేయకపోతే మాత్రమే అని అర్థమవుతోంది. వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేలకు బానిసల్లాగా వ్యవహరించకపోతే.. తక్షణం వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేస్తారని, అంతటి అభద్రతతో కూడిన ఉద్యోగాల వ్యవస్థగా వాలంటీర్లను తయారుచేశారని పలువురు విమర్శిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles