వాలంటీర్లను తొలగించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు!

Sunday, December 22, 2024

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం లోనూ, ఆ దిశగా లబ్దిదారులకు సేవలందించడంలోనూ ఇప్పటివరకు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న గ్రామ-వార్డు సచివాలయాల వాలంటీర్లను దశలవారీగా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వారి తొలగింపుకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులే అందుకు నిదర్శనంగా ఉన్నాయి.  నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా సచివాలయాల పరిధిలో వాలంటీర్ల వ్యవహార శైలిపై అనేక విమర్శ లు వచ్చినా కేవలం అతి తక్కువ మందిని మాత్రమే తాత్కాలికంగా తప్పించిన సందర్భాలు ఉన్నాయే తప్ప పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగించిన దాఖలాలు లేవు.

వారు వాస్తవానికి వైసిపి కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వారితోనే వైసిపి ఎన్నికల యంత్రాంగం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో సైతం వాలంటీర్లను ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోబోతున్నామో చెబుతూ వస్తున్నారు. అయితే, పలుచోట్ల వారు స్థానిక వైసిపి నేతలను సహితం లెక్కచేయడం లేదు. దానితో అడ్డుఅదుపు లేకుండా అవినీతికి పాల్పడుతూ అధికార పార్టీకి గుదిబండగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా జగన్‌ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే దశల వారీగా వాలంటీర్లను ఇంటి బాట పట్టించేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 2. 67 వేల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల రూ.5 వేలు వంతున గౌరవ వేతనాన్ని అందిస్తోంది. ప్రతీ వాలంటీర్‌కు 50 కుటుంబాల బాధ్యతలను అప్పగించారు.

50 నివాసాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు అవసరమైన సేవలు త్వరితగతిన అందించడంతో పాటు ప్రభుత్వానికి ఆయా కుటుంబాలను మరింత దగ్గరగా ప్రభుత్వ పథకాలను వారికి అర్ధమయ్యే రీతిలో వివరించేలా వాలంటీర్‌ వ్యవస్థ పనిచేస్తూ వస్తోంది.

అయితే వైసిపి కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్న వారు ఎన్నికల విధుల్లో పాల్గొనేటట్లు చేయడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి ఎటువంటి ఎన్నికలకు సంబంధించిన పనులు అప్పచెప్పాలని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.

వాలంటీర్ల సేవలు ఎలా ఉన్నా..ఆరోపణలు వస్తే షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ తర్వాత వారి తప్పు చేసినట్లు రుజువైతే తొలగించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం గమనిస్తే చాలామందిని ఇంటికి పంపేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles