వారేమో ప్రశంసలు, ప్రతిపక్షాలేమో విమర్శలు.. కేటీఆర్ మండిపాటు

Saturday, January 18, 2025

ఒక వంక కేంద్ర ప్రభుత్వం, మరోవంక పొరుగున ఉన్న ఏపీ నేతలు తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రశంసలు కురిపిస్తుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలకు దిగుతున్నారంటూ తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, బిజెపి చేస్తున్న విమర్శలను మంత్రి కె టి రామారావు తిప్పికొట్టారు.  ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు `మెచ్చుకొంటున్న’ ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు కూడా తెలిపారు.  

కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ వ‌దిలిన బాణాలని, కానీ తెలంగాణ గ‌ల్లీ నుంచి ప్ర‌జ‌లు త‌యారు చేసిన బ్ర‌హ్మాస్త్రం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. అందుకే తమ ప్రభుత్వంలో నిర్ణ‌యాలు మెరుపువేగంతో జ‌రుగుతున్నాయని, ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని తెలిపారు. రాజ‌కీయాలు, ప్ర‌జాజీవితం అంటే టెన్ జ‌న్‌ప‌థ్ కాదు.. తెలంగాణ జ‌న‌ప‌థంతో క‌లిసి కదం తొక్కితే అప్పుడు ఆద‌ర‌ణ ఉంట‌ది కానీ, టెన్ జ‌న్‌ప‌థ్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడితే మీ వ‌ల్ల ఏం కాదంటూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఆత్రుత చెందుతున్న కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు.  

తెలంగాణ అభివృద్ధి ప‌క్క రాష్ట్రంలోని చంద్ర‌బాబు, జ‌గ‌న్‌లకు అర్థ‌మైంది. కానీ రాష్ట్రంలోని విప‌క్షాల‌కు అర్థం కావ‌డం లేద‌ని కేటీఆర్ వాపోయారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో చేప‌ట్టిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగిస్తూ, హైద‌రాబాద్ అభివృద్ధిని, భూముల విలువ‌ను చంద్ర‌బాబు గుర్తించారని మెచ్చుకున్నారు. తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే ఏపీలో 100 ఎక‌రాలు కొనొచ్చు అంటూ తెలంగాణ‌ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

కేసీఆర్‌కు రైతుల‌పై ప్రేమ ఉన్నందునే మీట‌ర్ల‌కు ఒప్పుకోలేద‌ని చంద్ర‌బాబు అన్నారని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా మెచ్చుకున్నారని చెబుతూ దిశ ఘ‌ట‌న విష‌యంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని జ‌గ‌న్ కూడా అన్నారని పేర్కొన్నారు. తెలంగాణ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను మెచ్చుకున్న జ‌గ‌న్‌కు కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు. జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు అర్థ‌మైన విష‌యాలు విప‌క్షాల‌కు అర్థం కావ‌ట్లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

అదీగాక, తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు న‌ల్లాల ద్వారా అందుతుంద‌ని కేంద్ర మంత్రినే పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణ‌కే వ‌చ్చాయని తెలిపారు. గ‌త 9 ఏండ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ. 29 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిందని చెబుతూ కాంగ్రెస్ హ‌యాంలో గ్రామాల్లో పెట్టిన ఖ‌ర్చు రూ. 6 వేల కోట్లు మాత్ర‌మే నని లెక్కలతో సహా సభ ముందుంచారు కెటిఆర్. కాంగ్రెస్ హ‌యాంలో మానేరు ఒడ్డున ఉన్న‌వారికి కూడా మంచినీరు అందేది కాదని గుర్తు చేశారు

“మాదేమో గ‌ల్లీ పార్టీ.. సింగిల్ విండో చైర్మ‌న్ నుంచి ముఖ్య‌మంత్రి అయిన వ్య‌క్తి మా నాయ‌కుడు. వారిది ఢిల్లీ పార్టీ. ప్ర‌భుత్వంలో, పార్టీలో నిర్ణ‌యం తీసుకోవాలంటే.. ధైర్యం, సాహ‌సం, తెగువ, తెలివి, స్వేచ్ఛ‌, స్వ‌తంత్రం, వెన్నెముక ఉన్న నాయ‌కుడు మాకున్నాడు” అంటూ తమ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. “కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలు ఢిల్లీలో ఉంటాయి. ఈ లోపు ప్ర‌జ‌లు ఇక్క‌డ చస్తారు. కాంగ్రెస్, బీజేపీనో అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌తి దానికి ఛ‌లో ఢిల్లీ అంటారు” అంటూ ఎద్దేవా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles