వామపక్షాల ఐక్యత మోదీని ఓడించేందుకా? రాజకీయ అస్తిత్వం కోసమా?

Wednesday, September 18, 2024

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటి నుంచే సమైక్య పోరాటాలు నిర్వహిం చాలని  హైదరాబాద్ లో జరిగిన సీపీఐ , సీపీఎం సంయుక్త సమ్మేళనం పిలుపునిచ్చింది. మోదీని ఓడిస్తేనే దేశం బతుకుతుందని లేకుంటే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కలిసే ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. వాస్తవానికి 1955 ఎన్నికల ముందే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని అంటూ ముందే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి, ఘోరంగా ఎదురు దెబ్బతిన్నప్పటి నుండి తెలుగు నెల కమ్యూనిస్టుల ప్రాబల్యం క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది.

సుమారు రెండు దశాబ్దాల పాటు ఏదో ఒక పార్టీతో – ఒక సారి టిడిపి, మరోసారి కాంగ్రెస్ లతో పొత్తులు పెట్టుకొని తమ రాజకీయ చట్టసభలలో కొద్దిపాటు ప్రాతినిధ్యం పొందుతూ తమ రాజకీయ అస్తిత్వం కాపాడుకొంటూ వచ్చారు. అయితే గత 15 ఏళ్లుగా రెండు తెలుగు రాస్త్రాలలో ఒక్క ఎంపీ గాని, ఒక్క ఎమ్యెల్యే గాని, ఒక్క ఎమ్యెల్సీ గాని లేకపోవడంతో రాజకీయంగా ఉనికి ప్రశ్నార్థకమైంది.

మరోవంక, ఏ పార్టీ కూడా కమ్యూనిస్టులతో పొత్తులకు ముందుకు రావడం లేదు. అదీగాక రెండు కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల మధ్య ఇగో సమస్య కూడా ఏర్పడడంతో ఎవ్వరి దారి వారిదయింది. ఒక పార్టీ కేసీఆర్ కు ప్రేమ సందేశాలు పంపుతుండటం, మరోపార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపే ప్రయత్నం చేస్తుండటం జరుగుతూ వస్తున్నది.

ఏదేమైనా, ఇటీవల కాలంలో తెలంగాణాలో మొదటి సారిగా రెండు ప్రధాన కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ బలమైన సందేశం ఇచ్చినట్లయింది. అయితే ఇక్కడ నాయకులు చెప్పినట్లు మోదీ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడటం కన్నా, రాజకీయంగా తమ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకొని బిఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకొని, నాలుగు సీట్లు గెల్చుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తుంది.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాలతో పాటు ఈ పార్టీల అగ్రనాయకులు బివి రాఘవులు, కె నారాయణ పాల్గొని వామపక్షాల శ్రేణులలో నూతన ఔత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రజాసంఘాలలో వామపక్షాల ప్రాబల్యం తగ్గుతూ ఉండటం, పోరాటాలు చేసే ఒరవడి క్షీణిస్తూ ఉండటంతో వామపక్షాలు ఇప్పుడు తమ ఉనికి చాటుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.

గత ఏడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా తమ అవసరం కోసం కేసీఆర్ వామపక్షాల సహకారం కోరడంతో అప్పటి నుండి వాటిల్లో ఒక పెద్ద అండ తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు దొరికిందనే సంబరం కనిపిస్తున్నది. ఈ సంబరం ఎంతకాలం నిలబడుతుందో చూద్దాం.

తెలంగాణాలో బలపడేందుకు, తద్వారా అధికారంలోకి వచ్చేందుకు ఉరకలు వేస్తున్న బీజేపీ దూకుడును కట్టడి చేయాలని ప్రసంగాలు చేసిన ప్రతి నాయకుడు ప్రధానంగా తమ శ్రేణులకు పిలుపిచ్చారు. అటు బిఆర్ఎస్ పైన గాని, ఇటు కాంగ్రెస్ పైన గాని ఎటువంటి విమర్శలు చేయకపోవడం గమనిస్తే ఆ రెండు పార్టీలు కలసి ఉమ్మడిగా పోటీ చేయాలని, వారిద్దరితో కలసి తాము పోటీ చేయాలని వీరు కోరుకొంటున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles