వామపక్షాలతో చేతులు కలిపిన చంద్రబాబు!

Wednesday, January 22, 2025

వచ్చే ఎన్నికలలో ఒకవంక జనసేనతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ, మరోవంక బిజెపితో కూడా పొత్తుకోసం సానుకూల సంకేతాలు పంపుతున్నా ఫలితం లేకపోతున్న సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వామపక్షాలతో పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు. తద్వారా బిజెపి కలసిరాని పక్షంలో జనసేన, వామపక్షాలతో కలిసి 2024 ఎన్నికలలో ముందుకు వెళ్లేందుకు సంసిద్ధతను తెలిపినట్లయింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఈ నెల 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించి అధికార వైసిపి దూకుడుగా వ్యవహరిస్తున్నది. పైగా, పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పించి ఎట్లాగైనా విజయం సాధించేందుకు అధికార యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగ పరుస్తున్నది.

అయితే, వైసిపి ఎత్తుగడలను తిప్పికొట్టాలని టీడీపీ, వామపక్షాలు ఇప్పుడు ఉమ్మడిగా వ్యూహరచనకు దిగుతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించింది. జనసేనతో పొత్తు విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం, ఆ పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు.

టీడీపీ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ చేయ‌కుండా వామ‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ప్రాధాన్య‌త ఓట్ల క్ర‌మంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మొద‌టి, ద్వితీయ ఓట్ల ఆధారంగా పొత్తులు ఖ‌రారు చేశారు.

రెండు రోజులలో టిడిపి, వామపక్షాలు ఈ పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికార వైసీపీకి చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు వ్యూహరచన చేస్తున్నారు. వామ‌ప‌క్షాల‌తో పొత్తు ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో విజ‌యం సాధించవచ్చని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

మరోవంక, బిజెపి కేవలం మూడు గ్రాడ్యుయేట్ల స్థానాలలో మాత్రమే పోటీచేస్తున్నది. వారిలో ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తున్న పివిఎన్ మాధవ్ గత ఎన్నికలలో టిడిపి మద్దతుతో గెలుపొందారు. ఇప్పుడు జనసేన తమకు మద్దతు ఇస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు ఎవ్వరు, ఎక్కడా ఈ విషయమై ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ద్వితీయ ప్రాధాన్య ఓటును పంచుకునేందుకు టీడీపీ, వామపక్షాలు రాష్ట్ర స్థాయిలో నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఉమ్మడిగా జనసేన మద్దతు అధికారికంగా కోరేందుకు సిద్దపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles