వలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డ ఏపీ హైకోర్టు

Monday, September 16, 2024

వచ్చే ఎన్నికలలో తన మానస పుత్రిక వలంటీరు వ్యవస్థ తనను గెలిపిస్తుందన్న నమ్మకంతోముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండగా, ఈ వ్యవస్థ ఉనికిపై ఏపీ హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వలంటీర్లను పెట్టారా? అని హైకోర్టు నేరుగా ప్రశ్నించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? అని నిలదీసింది.

గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా? అని అడిగింది.  రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని, గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించింది.

సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనదని హైకోర్టు స్పష్టం చేసింది. వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని పేర్కొంటూ చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోర్టు తెలిపింది. శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించండి అని కోర్టు వెల్లడించింది.

న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్‌ సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌కు జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా చేసింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. పంచాయతీకి 10 మందికి తగ్గకుండా నియమించారు. వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించడం వీరి ప్రధాన విధి. వీరికి నెలకు రూ.5 వేలు చొప్పున వేతనం కూడా ప్రకటించారు.

అయితే మిగతా ప్రజాప్రతినిధుల కంటే వలంటీర్లకే ప్రజల్లో పట్టు పెరిగింది. వారి మాటే చెల్లుబాటు అవుతోంది. ప్రజలు ఏ చిన్నపనికైనా వారినే సంప్రదిస్తున్నారు. ఇది పదవుల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మింగుడుపడడం లేదు. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు సైతం వలంటీరు వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

అటు ప్రభుత్వం నిర్దేశించిన గడపగడకూ కార్యక్రమంలో వలంటీరు లేనిదే అడుగు తీయలేని పరిస్థితి ప్రజాప్రతినిధులకు దాపురించింది. చివరకు పథకాలు ఇస్తోంది ఎవరు? అని ప్రశ్నించినప్పుడు వలంటీర్లే కదా అని బదులిచ్చేదాక పరిస్థితి వచ్చింది. దీనిపైనే అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

చాలా గ్రామాల్లో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు వలంటీర్లు స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలకు లెక్క చేయడం లేదు. మరికొందరు తమకు నచ్చిన రీతిలో పనిచేస్తున్నారు. అటువంటి చోట జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో వలంటీర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వలంటీర్లపై నియంత్రణ అవసరమని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. అటు ఎమ్మెల్యేలు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles