వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఆదివారం ఏలూరులో చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతుంది. విజయవాడలో ఆయనపై ఈ వాఖ్యలు చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయినా పవన్ వెనుకడుగు వేయడం లేదు. మళ్ళి, మళ్ళి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు సేకరిస్తున్న డేటా హైదరాబాద్ కు వెళ్లడం గురించి పవన్ సంధిస్తున్న ప్రశ్నలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది. 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. మొత్తానికి సెక్షన్స్ అన్నీ వాడేసి మరీ కేసు ఫైల్ చేశారు.
సంక్షేమ పథకాల లబ్దిని అందజేయడానికి పత్రాలు సరిగ్గా లేవని వలంటీర్లు ఒంటరి అమ్మాయిలు, మహిళలను బెదిరిస్తోన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వలంటీర్ల వల్ల పల్లెల్లో ఉండే ఆడపిల్లల పరిస్థితి గద్ద కాళ్ల కింద నలిగిన కోడిపిల్లల్లా తయారైందని ధ్వజమెత్తారు. వలంటీర్ల దౌర్జన్యానికి గురైన అమ్మాయిలు- పరువు పోతుందనే ఉద్దేశంతో తమకు జరిగిన దారుణాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
తమను ఇబ్బందులకు గురి చేసిన వలంటీర్లపై పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంప్లైంట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వలంటీర్ల పట్ల తనకు సదుద్దేశం ఉందని, వారందరూ తన అక్క చెల్లెళ్లు, సోదర సమానులని పేర్కొన్నారు.
అయితే వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం (డేటా) దుర్వినియోగం అవుతుందనే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. డేటా గోప్యత గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం, ఉన్నత న్యాయస్థానాలు సహితం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుండటంతో రాబోయే రోజులలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళన బయలుదేరినట్లు తెలుస్తున్నది.
ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొంటూ వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుందని పవన్ వేస్తున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేక పోతున్నారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదంటూనే ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకి తెలుసని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం మరొకటి కావొచ్చని చెబుతూ సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు.
6 కోట్ల ఆంధ్రుల సమాచారం హైదరాబాద్ కు ఎందుకు పోతోందని పవన్ వేసిన ప్రశ్న ఏపీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నది. నానాక్‌రాం గూడాలోని ఎఫ్ఓఏ ఏజెన్సీ ఎవరిదని, ఆ సంస్థలోని 700 మందికి జీతాలు ఇస్తోంది ఎవరని ప్రశ్నించారు. సమాచారం పక్కదారి పడితే జగన్ బాధ్యత తీసుకుంటారా? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.