మరికొద్ది నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో బీజేపీలో ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఎన్నికలు జరుగబోయే రాస్త్రాలలో దాదాపు ప్రతి నెలా ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటనలు జరుపుతూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తుండటం ఆనవాయితీగా వస్తున్నది.
తెలంగాణాలో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో గత ఆరు నెలల్లో ఏడు సార్లు ప్రధాని పర్యటించారు. కానీ తెలంగాణ విషయంలో బిజెపి అగ్రనాయకుల పర్యటనలు అనేకసార్లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ప్రధాని పర్యటించారు. అమిత్ షా ఒక సారి మాత్రమే పర్యటించారు. ఒక విధంగా ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి నిర్దుష్టమైన వ్యూహం రూపొందించుకున్న దాఖలాలు లేవు.
ముఖ్యంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించి, పార్టీని సమాయత్తం చేయడంలో కీలకంగా వ్యవహరించి అమిత్ షా పర్యటనలు తరచూ వాయిదా పడుతూ ఉండటం పార్టీ నేతలకు ఆశాభంగం కలిగిస్తున్నది. ముఖ్యంగా ఈ నెల 29న ఖమ్మంకు రావలసిన అమిత్ షా పర్యటనను హైదరాబాద్ కు మార్పించి, పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఎన్నికల వ్యూహ రచన జరిపేందుకు కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి కార్యక్రమం రూపొందించుకున్నారు.
అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి గత నెల 27న ఆయన ఖమ్మం రావలసి ఉండగా అప్పట్లో గుజరాత్ లో తుఫాన్ అంటూ వాయిదా పడింది. ఈ ఏడాది అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తెలంగాణ పర్యటనకు తేదీలు ఖరారు చేయడం, చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం అమిత్ షాకు పరిపాటిగా మారింది.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్‌షా జనవరి 28, 29 తేదీల్లో తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా, తొలుత దానిని ఫిబ్రవరి 11కి వాయిదా వేసి, ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, సభ పెడితే పరువు పోతుందనే భయంతోనే ఇలా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆ తర్వాత మే 27న సమావేశానికి రావాల్సి ఉండగా అదీ రద్దయ్యింది. గత నెలలో ఖమ్మంలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని విస్తృతంగా ప్రచారం చేసినా, రెండు రోజుల ముందు రద్దయ్యింది.
ఈ నెల 29న అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తారని ప్రచారం చేసి రెండు రోజుల ముందు మళ్లీ ‘రద్దు’ వార్త వెలువడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమిత్‌షా తలపెట్టిన తొలిపర్యటన ఇది. చివరి నిమిషంలో రద్దు కావడంతో కిషన్‌రెడ్డి ఫీలవుతున్నట్టు తెలిసింది. కానీ అమిత్‌షా పర్యటన రద్దుతో ఏమిచేయాలో తెలియక కిషన్‌రెడ్డి తలపట్టుకున్నట్టు సమాచారం.