వరంగల్ పోలీస్ కమీషనర్ కు బండి సంజయ్ `రిటర్న్ గిఫ్ట్’!

Sunday, December 22, 2024

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను మొదటి ముద్దాయిగా పేర్కొంటూ, అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకా తట్టుకోలేక పోతున్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేయకుండా తనపై కేసు నమోదు చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ కు `రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు తొందరపడుతున్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు.

తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంటూ ఆయనపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. తన హక్కుల భంగంతో పాటు ఇతర విషయాలపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని కూడా నిశ్చయించుకున్నారు. ఒక విధంగా తనపై కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నించే పొలిసు అధికారులకు ఒక హెచ్చరిక పంపే ప్రయత్నం చేస్తున్నారు.

“వరంగల్‌ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. నా ఫోన్‌ ఇవ్వడం లేదని అంటున్నారు. ముందు సీపీ ఫోన్‌ కాల్‌ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి” అంటూ సవాళ్లు విసురుతున్నారు.

“ఈటల రాజేందర్‌ ఫోన్‌ అడిగే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నా ఫోన్‌ కేసీఆర్‌ దగ్గరే ఉంది. మీ దగ్గరే నా ఫోన్‌ పెట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నారు. నా ఫోన్లో నాకు టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలని చూసి కేసీఆర్‌కు చక్కర్ వచ్చింది. అందుకే ఫోన్ దగ్గర పెట్టుకొని ఇవ్వట్లేదు.” అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తమకు తెలుసని చెబుతూ  నల్లగొండ, ఖమ్మంలో ఏం చేశావో తెలుసని అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. ‘‘నువ్వు వేసుకున్న ఖాకీ డ్రెస్ మీద ప్రమాణం చేయాలి. నీ ఆస్తి పాస్తుల చిట్టా బయటకు తీస్తా. నువ్వు ఎక్కడెక్కడ దందాలు చేస్తున్నావో నాకు తెలుసు’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో సంజయ్‌ ప్రభుత్వాన్ని అసమర్థంగా చూపడానికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడానికి ప్రయత్నించారని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సంజయ్ అరెస్ట్ సమయంలో ఆరోపించారు.

ఇదిలా ఉంటే, బండి సంజయ్ రిమాండ్ ఆర్డర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే  సంజయ్ బెయిల్ మీద బయటికి వచ్చినట్టు కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు. సంజయ్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఏజీ వెల్లడించారు.

విచారణకు సహకరించనందుకు బెయిల్ రద్దు చేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో  సంజయ్ బెయిల్ రద్దుపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తనకు బెయిల్ రావద్దు అని ఎలా అంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తానేమైనా ఉగ్రవాదినా అని ప్రశ్నించారు.

రిమాండ్ మీద విచారణ అవసరం లేదని ఏజీ వాదించారు. ఫోన్ ఇవ్వకపోవడం, పోలీసులకు సహకరించడం లేదన్న విషయాలను అఫిడవిట్ దాఖలు చేసి ఆన్ రికార్డ్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles