వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం

Sunday, December 22, 2024

2024 ఎన్నికలను ప్రస్తావిస్తూ “వచ్చేది కురుక్షేత్రం…..ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం.” అంటూ టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు. రాజమహేంద్రవరం భారీ సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణుల సమక్షంలో

అట్టహాసంగా ప్రారంభమైన రెండు రోజుల వార్షిక మహానాడులో ప్రసంగిస్తూ ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకు పోదాం అంటూ సింహగర్జన చేశారు.  తెలుగు దేశం సింబల్ సైకిల్..ముందు చక్రం అంటే సంక్షేమం, రెండో చక్రం అభివృద్ధి. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. దాంతో ఇక దూసుకుపోవడమే అంటూ శ్రేణులను ఉత్సాహ పరిచారు. ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి.. మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం అని గుర్తు చేశారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదామని సంకల్పం తీసుకుందామని చెప్పారు.

క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్‌ ప్రపంచానికి చాటి చెప్పారని చెబుతూ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొంటూ నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని, అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే  తెలుగు దేశం జెండా… తెలుగు జాతికి అండ అని స్పష్టం చేశారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీఅని.. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారని, కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ…..జై జగన్ అనలేదని ఉద్వేగంతో చెప్పారు. జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడన్నారు. అందుకే చంద్రయ్య పాడె మోశానని పేర్కొన్నారు.  కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగుదేశం కార్యకర్తలు నిలబడ్డారని అభినందించారు. “మీ అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా, శిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా” అని చెప్పారు.

2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలని పనులు చేశామని చెబుతూ వ్యవసాయంలో 11 శాతం వృద్ధి రేటు సాదించామని, ఇరిగేషన్ పై రూ.64 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొంటూ ఆ పెట్టుబడులు వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు చెప్పారు. అయితే, 2019లో ఒక్కడు వచ్చి, ఎన్నో మాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం ఉందని చెబుతూ సీఐడీ అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రివర్స్ టెండర్లు, పరిపాలనను రివర్స్ చేశారని, ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన మొదలు పెట్టారని ఆరోపించారు. అమరావతిని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో రూ. 2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్‌ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు.

“పోలవరం పూర్తి అయ్యి నదుల అనుసంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి. ఒక్క రోడ్డు వేయలేదు…ఒక్క ప్రాజెక్టు కట్టలేదు…..ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు జాబ్స్ లేవు. దిశ చట్టం అన్నాడు…ఎక్కడ ఉందో చెప్పాలి. లేని చట్టం పేరుతో రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ పెట్టాడు” అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఏకరువు పెట్టారు.

“ఉద్యోగం రావాలంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నాడు. 25 మందిని గెలిపిస్తే….ప్రత్యేక హోదా సాధిస్తాను అని…ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. అమ్మఒడి ఒక నాటకం…నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. జగన్ నాలుగేళ్ల తప్పిదాలపై చెప్పాలంటే మన ఒక్క మహానాడు సమయం సరిపోదు” అని వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles