ఇటీవల ఏపీ ప్రభుత్వం డిజిపిలుగా ప్రమోషన్ ఇచ్చిన ముగ్గురు అధికారులలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయనను డిజిపిగా నియమించేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే శాంతి భద్రతలకు సంబంధించిన కీలక అంశాలపై సీఎం జగన్ డిజిపిని కాకుండా సునీల్ సలహాలపై వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర అప్రదిష్టపాలు కావించిన ప్రతిపక్షాల రాజకీయ సభలను అడ్డుకొనే జిఓ 1 సునీల్ ఆలోచనల నుండే వచ్చినట్లు తెలుస్తున్నది.
అందుకనే `డిఫాక్టో డిజిపి’ అంటూ సీనియర్ పోలీస్ అధికారులు వ్యక్తిగత సంభాషణలలో ఎద్దేవా చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థకు పూర్తిగా వైసిపి రంగు పూసేయడానికి ఇంతకు మించిన నమ్మకస్తుడైన’ అధికారి ఎన్నికల సమయంలో జగన్ కు లభించే అవకాశం ఉండకపోవచ్చని చెప్పుకొంటున్నారు.
సిఐడి చీఫ్ గా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు రాజకీయ ప్రత్యర్థులపై అడ్డదిడ్డంగా కేసులు నమోదు చేసి, అరెస్ట్ లకు పాల్పడటంతో ఎన్నికల సమయంలో భయానక వాతావరణం సృష్టించి, రాజకీయ ప్రత్యర్థులను అసలు ప్రచారం చేసుకోకుండా కట్టడి చేయగలరని భావిస్తున్నారు.
అందుకనే, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అక్రమంగా కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసిన్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకొంటూ వస్తున్నది. అంతేకాదు, ఉన్నత పోలీస్ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొనడమే కాకూండా, హిందూమతంపై విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం లెక్కచేయలేదు.
స్వయంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సహితం ఆ అధికారి వ్యవహారంపై కన్నెర్ర చేసినా ఢిల్లీలో బిజెపి పెద్దలతో గల లాలూచీ సంబంధాలతో సీఎం జగన్ కాపాడుకొంటూ వస్తున్నారు. ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి సహితం సీఎం జిల్లాకు చేసిన, కావాల్సిన వ్యక్తి అయినా మర్యాదస్తుడు, అడ్డదిడ్డంగా పనిచేయలేరనే పేరుండడంతో ఎన్నికల సమయంలో అక్కరకు రారని నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారని చెబుతున్నారు.
ఎన్నికల సమయానికి అన్ని ప్రభుత్వ కీలక స్థానాలలో అడ్డదిడ్డంగా పనిచేసే అధికారులు ఉండేటట్లు ఇప్పటి నుండి వ్యూహాత్మకంగా చర్యలు చేబడుతున్నారు. చట్టం, న్యాయం, నిబంధనలను పట్టించుకోకుండా, రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులను కావించగల అధికారులను ఏరి, కోరి కీలక స్థానాల్లో నియమిస్తున్నారు.