పరిపాలన మొదటిరోజు నుండే జగన్ అవినీతికి పాల్పడ్డారని, వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ లపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని అంటూ ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత తనకు `జ్ఞానోదయం’ అయిన్నట్లు ఆశ్చర్యం ప్రకటించారు. అయితే, తానింకా వైసిపిలోనే ఉన్నానని, ఆ పార్టీ నుండి తనను బైటకు పంపలేదంటూ చెప్పడం గమనార్హం.
మొత్తం 175 సీట్లు గెలుస్తామంటున్న వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని రవీంద్రా రెడ్డిజోస్యం చెప్పారు. అలా అంటూనే గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని చెప్పారు.
”నా పనితీరు గురించి తెలిసిన ఏ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో నన్ను తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఏ పార్టీ గేటు వద్దకు వెళ్లి సీటు అడిగి తీసుకోను. ఏదైనా గుర్తింపు ఉన్న పార్టీ తరఫున పోటీ చేస్తాను. ఇంకా ఏ పార్టీ నుంచి ఆఫర్ రాలేదు” అంటూ వచ్చే ఎన్నికలలో తనకు సీట్ ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్లు `అసలు రహస్యం’ చెప్పేసారు.
2019 ఎన్నికలలో తన సొంత నియోజకవర్గం మైదుకూరు నుండి పోటీ చేయడం కోసం ఇవ్వమని ఒక వంక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, మరోవంక వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిలను కోరారు. అయితే అప్పటికే అభ్యర్థులను నిర్ణయించామని వారు చెప్పడంతో నిరాశ చెందారు. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కూడా సంకేతం ఇచ్చారు.
చివరకు, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో వచ్చే ఎన్నికలలో ఎట్లాగూ సీట్ వచ్చే అవకాశం లేదని మూడున్నరేళ్లలో స్పష్టం కావడంతో ఇప్పుడు టీడీపీ, జనసేనల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ రెండు పార్టీలు కలిసి, తనకు వారిలో ఎవరో ఒకరు సీట్ ఇస్తే పోటీ చేసి గెలుపొందవచ్చనే అభిలాషను బహిరంగ పరచారు.
దేవుళ్లందరూ కలసి వచ్చినా ఇప్పుడు ఏపీని బాగుచేయలేరని అంటూ జగన్ రాష్ట్రాన్ని అంత అధ్వాన్నంగా పాడు చేశారని విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు సీఎం అయితే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని కితాబు ఇచ్చారు. మరో నేత ఎవరూ ఇప్పుడు కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని తేల్చి చెప్పారు.
మరోవంక, పవన్ కల్యాణ్ నిజాయతీని ఎవరూ తప్పుబట్టలేరని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, పవన్ కు పరిపాలనా దక్షత ఉందని నేను అనుకోవడంలేదని అంటూ “చంద్రబాబు, పవన్ కలుస్తారో లేదో తెలియదు కానీ… వాళ్లిద్దరూ కలిసి ఏపీని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా” అని తన అసలు ఉద్దేశ్యం చెప్పారు.
2009 ఎన్నికల అనంతరం డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి తన మంత్రివర్గం నుండి డా. రవీంద్రారెడ్డిని తొలగించినా, కడప జిల్లాలో జగన్ ను కట్టడి చేస్తారనుకొని కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. పైగా, కడప ఉపఎన్నికలో జగన్ పై పోటీ చేసేందుకు పార్టీ సీట్ ఇప్పించడమే కాకుండా, ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు సమకూర్చారు.
అయితే జగన్ తో లాలూచి పడి, ఆ నిధులను ఖర్చు పెట్టకుండా, హైదరాబాద్ లోనే దాచుకొని నాటకం ఆడినట్లు అప్పట్లో కాంగ్రెస్ లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఆయనను తన మంత్రివర్గం నుండి కిరణ్ కుమార్ రెడ్డి తొలగించారు.