వంద సీట్ల లక్ష్యం పార్టీ శ్రేణుల ముందుంచిన కేసీఆర్

Sunday, January 19, 2025

మరో ఆరు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వంద సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు పార్టీ శ్రేణుల ముందుంచారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన పార్టీ ప్లీనరిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.

‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తాం’ అంటూ పార్టీ శ్రేణులలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అంటే, మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో ఎంఐఎం ఆరేడు సీట్లు గెల్చుకొంటే, కాంగ్రెస్, బిజెపి కలిసి పది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందనే సంకేతం ఇచ్చారు.

తెలంగాణాలో అధికారమలోకి వస్తామని అంటున్న ఈ రెండు పార్టీలు సింగల్ డిజిట్ సీట్లకు పరిమితం కావలసి వస్తుందని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో ఇది అసాధ్యం అని అందరికి తెలిసినా పార్టీ శ్రేణుల ముందు `గంభీరమైన ముద్ర’ ఉంచేందుకు కేసీఆర్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

అందుకోసం నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని అంటూ దిశానిర్ధేశం చేశారు. బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుంచి భవిష్యత్తులో చేపట్టవచ్చని చెబుతూ  అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను సైతం నడపొచ్చని ప్రకటించారు. 

దళితబంధులో ఎమ్యెల్యేల కమీషన్లు
ద‌ళిత‌బంధు ప‌థ‌కంలో కొంద‌రు ఎమ్మెల్యేలు క‌మిష‌న్లు తీసుకొంటుండడంతో ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు కేసీఆర్ మాటలను బట్టి అర్థం అవుతుంది. అటువంటి ఎమ్యెల్యేల చిట్టా తన వద్ద ఉందని చెబుతూ, ప‌ద్ద‌తులు మాన‌కుంటే వారికి సీటు ఉండ‌దు, పార్టీ అండ ఉండ‌దంతూ కాస్త ప‌రుషంగా హెచ్చ‌రించారు.

అలాగే ఎమ్మెల్యేలు కాకుండా వారికి సంబంధించి ద‌ళిత‌బందులో క‌మిష‌న్ లు తీసుకున్నా ఆ బాధ్య‌త ఎమ్మెల్యేదేనంటూ తేల్చి చెప్పారు. వ్య‌క్తుల కంటే పార్టీ ముఖ్య‌మని కెసిఆర్ పేర్కొన్నారు. దళిత బంధుపై రోజురోజుకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండడంతో కేసీఆర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.

మరోసారి వసూళ్లకు పాల్పడితే.. టికెట్ కాదు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని కూడా తెలిపారు.దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల రూపాయల దళిత బంధులో మూడు లక్షల రూపాయిలను నొక్కేస్తున్నారని స్వయంగా సీఎం చెప్పుకురావడం గమనార్హం.

“మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్ షుడ్ బీ నాట్ బై చాన్స్.. బట్ బై చాయిస్” అంటూ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతుంది. 

అదేవిధంగా, పలు నియోజకవర్గాలలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న కుమ్ములాటలు పట్ల కూడా కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని సున్నితంగా హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తెలిపారు.

మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. అందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అంటూ ఎలాంటి సమస్య ఉన్నా అధిష్ఠానంతో విన్నవించుకోవాలని సూచించారు. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడాన్ని హితవు చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles