లోకేష్ పాదయాత్రలో తారక రత్న అస్వస్థతపై తెలుగు తమ్ముళ్ల ఆవేదన

Sunday, April 13, 2025

అసమర్థ, అవినీతి పాలనతో దగబడ్డ రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నాను అంటూ భరోసా కల్పించడం కోసం నేనున్నాను అంటూ తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన `యువగళం’ పాదయాత్ర అనూహ్యమైన ప్రజా స్పందనతో మహోత్తర ఘటనగా ప్రారంభం కాగా, అదే సమయంలో అందులో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న అస్వస్థకు గురవడంతో తెలుగు తమ్ములు ఆవేదన చెందుతున్నారు.

తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్లారు.

శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. డాక్టర్లతో పాటూ అందరితో చర్చించి బెంగళూరుకు తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా వెళ్లారు.

శుక్రవారం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం తీసుకొచ్చారు. ఆ అంబులెన్స్‌లోనే కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు.
కుప్పంలో పోటెత్తిన జనం మధ్య పాదయాత్రను లోకేష్ ప్రారంభిస్తున్న తరుణంలో తారకరత్న అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటు అని వైద్యులు తేల్చారు.

కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు.

వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పీఈఎ్‌సకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.

తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయిందని వైద్యులు గుర్తించినట్లు బాలయ్య తెలిపారు. మిగత పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయని.. తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

చికిత్స అందించిన కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అలాగే శుక్రవారం సాయంత్రం నారా లోకేశ్‌ కుప్పంలోని పీఈసీ ఆసుపత్రికి వచ్చి తారకరత్నను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సమాచారం మేరకు తారకరత్న గుండెలో బ్లాక్స్‌ అధికంగా ఉన్నాయి. స్టంట్‌ వేయాలంటే షుగర్‌ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోకపోవడంతో షుగర్‌ లెవల్‌ 400కు చేరింది.

కాగా, తారకరత్న చికిత్స విషయమై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన్ను తరలించే సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా వేగంగా ఆస్పత్రికి చేర్చడానికి సాయం చేయాలని కోరారు. పోలీసు అధికారులకు చెప్పి ఇబ్బంది లేకుండా చూస్తానని బొమ్మై హామీ ఇచ్చినట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles