లోకేష్ పాదయాత్రలో టిడిపి జెండా పట్టనున్న ఆనం!

Wednesday, September 18, 2024

గత ఏడాది వైసీపీ నుండి బహిష్కరణకు గురై వచ్చే ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ జెండా పట్టుకొనే సమయం ఆసన్నమైంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో జరుపుతున్న యువగళం పాదయాత్ర ఆ జిల్లాలో త్వరలో ముగియనుంది. దానితో రాయలసీమ మొత్తం తిరిగిన్నట్లవుతుంది.

కడప తర్వాత ఈ నెల 13న నెల్లూరు జిల్లాలో ప్రవేశించనున్న లోకేష్ పాదయాత్ర సన్నాహాలలో ఆనం క్రియాశీలకంగా పాల్గొనగలరని తెలుస్తున్నది. పైగా, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూర్ నియోజకవర్గం ద్వారా లోకేష్ నెల్లూరు జిల్లాలో ప్రవేశించనున్నారు. దానైతో భారీ స్వాగత సన్నాహాలకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై ఒకటి, రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో గంటకు పైగా సమావేశమై ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాల గురించి, తన రాజకీయ ప్రవేశం గురించి వివరంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నుండి తన కుమార్తె, నెల్లూరు నుండి తాను పోటీచేయాలని ఆనం భావిస్తున్నారు. నెల్లూరు నుండి గతంలో మాజీ మంత్రి డా. నారాయణ పోటీ చేసినా ఆనంకు సీట్ ఇచ్చేందుకు  చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, ఆనంకు, ఆయన కుమార్తె – ఇద్దరికీ అసెంబ్లీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేస్తారని తెలుస్తోంది. ఆనంను నెల్లూరు లోక్ సభకు పోటీ చేస్తే, ఆయన కుమార్తె ఆత్మకూరు లేదా నెల్లూరు నుండి పోటీ చేయవచ్చని సూచించారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పడుతుంది.

ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరి, నెల్లూరు రురల్ నుండి పోటీచేసేందుకు రంగం సిద్దమైనది. మరోవంక, బద్వేలులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను ఇవాళ ఉదయగిరికి చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిసి లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. ఏదేమైనా గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లను గెలుచుకున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో టిడిపి పెద్ద కుదుపు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోవంక, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టిడిపి నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తదితరులు కలిసి సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. టిడిపిలో చేరమని లాంఛనంగా ఆహ్వానించారు. లోకేష్ పాదయాత్ర సమయంలో నెల్లూరు జిల్లాలో కీలక నేతలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles