లోకేష్ పాదయాత్రపై టీడీపీ శ్రేణులలో లోపిస్తున్న స్పష్టత!

Saturday, January 18, 2025

ఎన్నికలు సమీపిస్తుండటంతో పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గరై ఎన్నికలలో విజయం సాధించాలని ఇప్పుడు చాలామంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుండి సంవత్సరం పాటు పాదయాత్ర చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుండి ప్రారంభమై 400 రోజుల పాటు 4,000 కిమీ మేర ప్రయాణించి జరిపే ఈ యాత్రకు `యువగళం’ అని పేరు పెట్టారు.

వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం సాధించలేకపోతే, ఆ పార్టీకి ప్రధాన ఆకర్షణగా ఉంటున్న చంద్రబాబు నాయుడు వయసు మీరడంతో ఆ తర్వాత టీడీపీ ప్రశ్నార్ధకం కాగలదని అంచనాలు వేస్తున్న సమయంలో `నేనున్నాను’ అంటూ పార్టీపై పట్టుకోసం ఆయన ప్రధానంగా ఈ యాత్ర చేపడుతున్నట్లు పేరును బట్టి స్పష్టం అవుతుంది. 

యువ ఓటర్లను ఆకర్షించడంతో పాటు, పార్టీలో లోకేష్ కు మద్దతుగా ఉండే యువకులకు నాయకత్వం అప్పజెప్పాలని ఉద్దేశ్యంతోనే వచ్చే ఎన్నికలలో 40 శాతం సీట్లు యువతకే ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు, పార్టీ సీనియర్ నేతలు పలువురికి `మీ కుటుంభంలో మరెవరైనా యువకులు ఉంటె చెప్పండి. మీకు సీట్ ఇవ్వడం సాధ్యం కాదు’ అని నిర్మొహమాటంగా చెబుతున్నట్లు కూడా తెలుస్తుంది. 

ఇబ్బందులు లేకుండా లోకేష్ కు రాజకీయ వారసత్వం కట్టబెట్టడం కోసం అంతవరకు బాగానే ఉంది. కానీ, లోకేష్ మద్దతుదారులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం పార్టీలో సీనియర్లను, వివిధ నియోజకవర్గాలలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తుండటం పలు చోట్ల వివాదాలకు దారి తీస్తుంది. 

పార్టీతో అసలు సంబంధం లేని వారు, విదేశాల నుండి వచ్చారానో, దండిగా డబ్బు ఖర్చు పెట్టగలరనో అభ్యర్థులుగా ప్రవేశ పెట్టడం కోసం లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు పలు నియోజకవర్గాల్లో `అసమ్మతి’ కుంపట్లు రాజేస్తున్నాయి. పైగా, ఈ యాత్ర నిర్వహణ భారం అంతటిని పార్టీతో సంబంధం లేకుండా పలు నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ శ్రేణుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న `యువ నేతలు’కు అప్పజెప్పుతూ ఉండటం సహితం వివాదాలకు కారణం అవుతుంది. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా చేరేముందు ఆయనకు గట్టి మద్దతుగా ఉండేవారుండాలనే వైసీపీ నుండి 26 మంది ఎమ్యెల్యేలను పార్టీ మారేటట్లు చేసి,  వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వారంతా లోకేష్ కు సన్నిహితులు కావడం గమనార్హం. పైగా, ఎన్నికలలో వారంతా ఓటమి చెందారు కూడా. 
తెలంగాణాలో బిఆర్ఎస్ లో పార్టీపై, ప్రభుత్వంపై కేటీఆర్ ఏ విధమైన పట్టు సంపాదించారో ఆ విధంగా తాను సంపాదించాలని లోకేష్ చేసిన ప్రయత్నాలే 2019 ఎన్నికలలో టిడిపి ఘోర  పరాజయానికి కొంతమేరకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. చివరకు చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండే నాయకులను, కార్యకర్తలను లోకేష్ దూరంగా ఉంచుతూ, తన సొంత మనుషులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుండటం కూడా పార్టీలో  దుమారం రేపుతోంది. 
ఇంతకు లోకేష్ ఎందుకు యాత్ర జరుపుతున్నారనే విషయమై పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైన సందేశం టిడిపి ఇవ్వలేక పోతున్నది. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు తెలియ చెప్పడం గురించా? కాబోయే ముఖ్యమంత్రిగా లోకేష్ కు ప్రజా మద్దతు కూడదీసుకోవడం కోసమా? వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం మాత్రమేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న వారిలోనే చంద్రబాబు నియమించిన వారు ఒక వర్గంగా, లోకేష్ సన్నిహితులు మరోవర్గంగా వ్యవహరిస్తున్నారు. ఒకరితో మరొకరికి సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు పార్టీ శ్రేణులకు తప్పుడు  సందేశాలను పంపే అవకాశం ఉంటుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles